అంతా మహిమ : తిరుమల కొండల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం

మండిపోతున్న ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా 45 డిగ్రీలు.. 46 డిగ్రీలు నమోదు అవుతుంది. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలంటేనే భయపడుతున్నారు జనం. మండే ఎండలతో సెగగాలులతో వడదెబ్బకు చనిపోతున్నారు జనం.. తెలుగు రాష్ట్రాలు మొత్తం ఇలా ఉంటే.. శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల కొండల్లో జోరు వాన.. చల్లటి వాతావరణం.. అవును.. 2024, మే 2వ తేదీ ఇలాంటి చల్లటి వాతావరణాన్ని.. వర్షంతో సేదతీరారు భక్తులు.

గురువారం ఉదయం నుంచి వాతావరణం కొంచెం చల్లగా ఉండగా.. మధ్యాహ్నం ఒక్కసారిగా మారిపోయింది. జోరు వాన పడింది. అర గంట పాటు ఆగకుండా వర్షం పడింది. నిన్నటి వరకు భగభగలాడిన సూర్యుడితో.. ఉక్కబోతతో అల్లాడిన తిరుమల క్షేత్రం చల్లగా మారిపోయింది. చల్లటి గాలులతో భక్తులు కూల్ అయ్యారు. 

తిరుమల కొండపైనే కాకుండా ఘాట్ రోడ్డు మొత్తం వర్షం పడటం విశేషం. దీంతో కొండ ఎక్కే వారు.. కొండ దిగేవారు వర్షంతో.. చల్లటి వాతావరణంతో సేదతీరారు. చాలా మంది భక్తులు వర్షంతో తడుస్తూ గంతులు వేశారు. 

ఇక్కడ విశేషం ఏంటంటే.. కొండ కింద తిరుపతిలో మాత్రం వర్షం లేదు.. కేవలం తిరుమల కొండల్లోనే వర్షం పడింది.