ఆసియా కప్ నుంచి భారత్ ఎక్కడ మ్యాచ్ ఆడుతుంటే వరుణుడు అక్కడికి వస్తున్నాడు. ఈ క్రమంలో ఆడిన మ్యాచుల కంటే ఆడని మ్యాచులే ఎక్కువగా ఉన్నాయి. శ్రీలంకను వదిలించుకొని భారత గడ్డపై అడుగుపెట్టిన టీమిండియాకు ఇక్కడ కూడా నిరాశ తప్పడం లేదు. వరల్డ్ కప్ లో భాగంగా గౌహతి, తిరువనంతపురంలో రెండు వార్మప్ మ్యాచులను రద్దు చేసుకున్న భారత్.. తాజాగా రేపు వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాతో జరగబోయే ప్రధాన మ్యాచ్ జరగడం కూడా అనుమానంగా మారింది.
భారత్ ఆస్ట్రేలియా జట్లు రేపు( ఆదివారం) చెన్నై వేదికగా మ్యాచ్ ఆడాల్సి ఉంది. కానీ చెన్నైలో గత కొంత కాలంగా వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజుల నుంచి రాజధాని నగరం తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంతేకాదు గత 24 గంటల్లో నుంగంబాక్కంలో 11 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ రోజు కూడా భారీగా వర్షం కురవడంతో ఇరు జట్లు ప్రాక్టీస్ ని కూడా ఆపేసాయి. పిచ్ మొత్తాన్ని కవర్లతో నింపేయడంతో ఇప్పుడు అభిమానులు ఆందోళనకి గురవుతున్నారు.
వాతావరణ సమాచారం ప్రకారం రానున్న రెండు రోజుల పాటు చెన్నైలో అనేక జల్లులు కొనసాగే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న ఈ మ్యాచులో ఛేజింగ్ చేసే సమయంలో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. ఇదే జరిగితే భారత అభిమానాలు తీవ్ర నిరాశకు లోనవ్వడం గ్యారంటీ. మరి రేపు వరుణ దేవుడు కరుణిస్తాడో లేకపోతే ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లుతాడో చూడాలి.