హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్ ను మబ్బులు కమ్మేశాయి. నగరంలో ఉదయం నుంచి పొడి వాతావరణం ఉంది. మధ్యాహ్నానానికి వాతావరణం చల్లగా మారింది. ఈ రోజు ( మే 26) మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మబ్బులు కమ్మేశాయి. మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. ఒక్కసారిగా కురుస్తున్న వర్షంతో వాతావరణం మారిపోయింది. మిట్ట మధ్యాహ్నం కారుమబ్బులతో చీకటిగా కనిపిస్తుంది. నగరంలోని కర్మన్ ఘాట్, చంపాపేట్, ఎల్ బీ నగర్, నాగోల్, బంజారా హిల్స్ లో భారీ వర్షం పడుతుంది. ఈ ప్రాంతాలతో పాటు చైతన్యపురి, సైదాబద్, మలక్ పేట్ పరిసర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది.
హైదరాబాద్‌లో పలుచోట్ల ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. మేడ్చల్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తున్నది. కీసర, ఘట్‌కేసర్ ప్రాంతాల పరిధిలో ఈదురుగాలులు వీస్తూ ఉరుములతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అబ్దుల్లాపూర్‌మెట్‌లోనూ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట ప్రాంతాల్లో ఉధృతంగా ఈదురుగాలులు వీశాయి.
ఉప్పల్, హయత్‌నగర్ ప్రాంతంలో గాలికి రేకులు, గుడిసెల పైకప్పులు కొట్టుకుపోయాయి. మల్కాజ్‌గిరి, తుర్కయాంజ్‌లో ఈదురుగాలులు వీయగా.. వర్షం కురిసింది. పలుచోట్ల పిడుగులుపడ్డాయి. అలాగే, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట పరిధిలోనూ ఈదురుగాలులతో వర్షం వాన కురిసింది. నాగోల్, మన్సూరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఎల్‌బీనగర్, వనస్థలీపురంలో గాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. శామీర్ పేటలో భారీగా ఈదురు గాలులు వీస్తున్నాయి. గాలి తాకిడికి రోడ్డుపై వెళ్తున్న బైకర్ పై ఓ చెట్టు పడి అక్కడికక్కడే మృతి చెందాడు.
నగర వాసులు మరో రెండు మూడు గంటల వరకు బయటకు రాకుండా ఉంటే మంచిదని జీహెచ్ఎంసీ అధికారులు అంటున్నారు. జగద్గిగిరిగుట్ట, బాలానగర్, మేడ్చల్, కీసర, కుత్ బుల్లాపూర్, అల్వాల్ ఏరియాల్లో భారీ వర్షం పడుతుంది. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలకు భారీ వర్షం కారణంగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు జీహెచ్ఎంసీ అధికారులు.