వరల్డ్ కప్ లో టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన పాకిస్థాన్.. ప్రస్తుతం దిక్కు తోచని స్థితిలో కనిపిస్తుంది. టోర్నీలో మూడు మ్యాచ్ లాడిన పాకిస్థాన్ ఒక మ్యాచ్ లోనే విజయం సాధించింది. దీంతో ఆ జట్టు సూపర్ 8కు వెళ్లే అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. అమెరికా, భారత్ జట్లపై ఓడిపోయిన పాక్.. కెనడాతో నానా తంటాలు పడి బోణీ కొట్టింది. పాక్ సూపర్ 8 కు అర్హత సాధించాలంటే భారత్ లేదా అమెరికా చివరి రెండు మ్యాచ్ లు ఓడిపోవాలి. అదే సమయంలో ఐర్లాండ్ పై భారీ తేడాతో గెలవాలి. ఈ దశలో పాక్ ను వర్షం వణుకు పుట్టిస్తుంది.
గ్రూప్ ఏ లో భాగంగా పాకిస్థాన్ తమ చివరి మ్యాచ్ ను ఐర్లాండ్ తో ఫ్లోరిడా వేదికగా ఆడాల్సి ఉంది. జూన్ 16 న ఈ మ్యాచ్ జరుగుతుంది. అమెరికా, ఐర్లాండ్ మ్యాచ్ కూడా ఇదే వేదికపై జరగనుంది. ఈ రెండు మ్యాచ్ ల్లో ఒక్క మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినా పాక్ ఇంటిదారి పడుతుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో జరగబోయే మ్యాచ్ లు వర్షం కారణంగా జరగడం అనుమానంగా మారింది. వాతావరణ సూచన ప్రకారం.. ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో రానున్న పది రోజుల ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం 95% ఉంది. మంగళవారం, బుధ ఇక్కడ భారీ వర్షాలు కురిశాయి.
గ్రూప్–డిలో భాగంగా శ్రీలంక, నేపాల్ జట్ల మధ్య బుధవారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. చెరో పాయింట్ దక్కించుకున్న ఇరు జట్లూ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టనున్నాయి. గురు, శుక్ర, శని, ఆదివారాల్లో వరుసగా 87%, 72% ,42% వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో పాకిస్థాన్ కు నిరాశ తప్పేలా కనిపించడం లేదు. ఐర్లాండ్ పై పాక్ ఖచ్చితంగా గెలవడంతో పాటు అమెరికా ఐర్లాండ్ పై ఓడిపోతేనే పాక్ సూపర్ 8 అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో పాక్ భవితవ్యం వర్షం పైనే ఆధారపడి ఉంది.
T20 ప్రపంచ కప్ 2024లో ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో మ్యాచ్ లు
జూన్ 14: అమెరికా vs ఐర్లాండ్
జూన్ 15: భారత్ vs కెనడా:
జూన్ 16: పాకిస్తాన్ vs ఐర్లాండ్