హైదరాబాద్లో ఈదురుగాలుల బీభత్సం.. పొరపాటున కూడా బయట అడుగు పెట్టొద్దు..!

హైదరాబాద్లో ఈదురుగాలుల బీభత్సం.. పొరపాటున కూడా బయట అడుగు పెట్టొద్దు..!

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో సోమవారం రాత్రి వాతావరణం ఒక్కసారిగా మారింది. ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఎమర్జెన్సీ అయితే తప్ప పొరపాటున కూడా ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. సిటీలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు పెద్ద ఎత్తున వీస్తున్నాయి. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు నగరంలో వీస్తున్నాయి. హైదరాబాద్లో  తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది.

ఏప్రిల్ 3న కూడా హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 3న(గురువారం) మధ్యాహ్నం ఒక్కసారిగా ఈదురుగాలులతో కుండపోత వాన పడింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దంచికొట్టింది. 5 గంటల్లోనే 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో మెయిన్​రోడ్లు మొదలుకొని కాలనీలు కూడా జలమయమయ్యాయి. బండ్లు కొట్టుకుపోయాయి. పలుచోట్ల ఇండ్లలోకి వరద చేరింది.

ఈదురుగాలులకు చెట్లు కూలడంతో పాటు రోడ్లు, ఫ్లైఓవర్లపై పెద్ద ఎత్తున వరద నిలవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్​జామ్ అయింది. భారీ వర్షానికి చార్మినార్ పెచ్చులు ఊడిపడ్డాయి. భాగ్యలక్ష్మి దేవాలయం వైపు ఉన్న మినార్‌‌లో పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. మినార్‌‌‌కు రిపేర్లు చేస్తామని అధికారులు తెలిపారు. కాగా, పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం మినహా.. మిగతా అన్ని జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి.