- ఈదురుగాలులు, వడగండ్లతో పలు చోట్ల పంట నష్టం
- చల్లబడ్డ వాతావరణం
- కౌటాలలో పిడుగుపడి ఎద్దు మృతి
ఆసిఫాబాద్, వెలుగు: ఎండ వేడితో ఉక్కిరిబిక్కిరవుతున్న జనాలకు మంగళవారం సాయంత్రం కురిసిన వర్షం కాస్త ఉపశమం లభించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన రాళ్ల వర్షం పడడంతో పంట నష్టం జరిగింది. మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల మండలం నాగేపల్లిలో పిడుగు పాటుకు గురై రైతు మోర్లే దసురుకు చెందిన ఓ ఎద్దు చనిపోయింది. దహెగాం మండలం కేంద్రంలోని వరి కొనుగోలు కేంద్రంలో వడ్లు తడిసిపోయాయి. ఓ తాటి చెట్టుపై పిడుగు పడి కాలిపోయింది.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతోపాటు గడిహత్నూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, బజార్హత్నూర్, తలమడుగు, తాంసి, ఆదిలాబాద్, బోథ్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. కొన్నిచోట్ల జొన్న పంట తడిసిపోయి రైతులకు నష్టం జరిగింది. జైపూర్ మండలంలోని వేలాల, శివ్వారం గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. దీంతో వరిపంట నేలకొరిగింది. వేలాల గ్రామంలో చెట్లు విరిగి రోడ్డు మీద పడ్డాయి. వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. భీమారం మండలంలో కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడ్డారు.