
- ఈ నెల 20 వ తేదీన దాడికి టెర్రరిస్టులు ప్లాన్ చేశారని దర్యాఫ్తులో వెల్లడి!
- ఆ రోజు వర్షం కారణంగా హోటళ్లలోనే ఉన్న టూరిస్టులు
- దాడిని వాయిదా వేసుకున్న ముష్కరులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలకు కారణమైన పహల్గాం మారణహోమం రెండు రోజుల ముందే జరిగేది. ఈ నెల 20, 21న పహల్గాంలో వర్షం కురిసింది. దీంతో బైసరన్ వ్యాలీకి పెద్దగా పర్యాటకులు రాలేదు. వాతావరణం కూడా ప్రతికూలంగా ఉంది. ఈ నేపథ్యంలో టెర్రరిస్టులు తమ ప్లాన్ ను వాయిదా వేసుకున్నారు. టూరిస్టులు ఎంత ఎక్కువగా ఉంటే అంత భయాందోళనలు సృష్టించవచ్చని భావించి సమయం కోసం వేచిచూశారు. ఈ నెల 22న వాతావరణం అనుకూలంగా మారడంతో వ్యాలీకి పర్యాటకుల సంఖ్య పెరిగింది.
ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూసిన టెర్రరిస్టులు.. వ్యాలీలో సరదాగా గడుపుతున్న టూరిస్టులను టార్గెట్ చేసి మరీ కాల్చిచంపారు. మతం ఏంటని అడిగి, ముస్లిమేతరులని కన్ఫామ్ చేసుకున్నాక పాయింట్ బ్లాంక్‌లో తుపాకులు గురిపెట్టి నలుగురిని కాల్చి చంపారు. అంతకుముందు మీ మతం ఏంటని వారిని అడిగారు. కాగా, ఈ మారణహోమానికి రెండు వారాల ముందే టెర్రరిస్టులు పహల్గాంలో రెక్కీ నిర్వహించారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. పహల్గాంలో ఈ టెర్రరిస్టుల కదలికలకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు స్థానికులను ప్రశ్నిస్తున్నారు.
సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.