వరల్డ్ కప్ లో పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుంది. 402 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ ధీటుగానే బదులిస్తుంది. మొదటి 10 ఓవర్లలో 75 పరుగులు చేసిన పాక్ 21.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 160 పరుగులు చేసింది. ఈ దశలో మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. ఓపెనర్ ఫకర్ జమాన్ 63 బంతుల్లోనే మెరుపు సెంచరీతో కివీస్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. ఫకర్ ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 9 సిక్సులు ఉండడం గమనార్హం. మరో వైపు కెప్టెన్ బాబర్ అజామ్ అతనికి సహకరించడంతో రెండో వికెట్ కు వీరి జోడీ అజేయంగా 117 బంతుల్లోనే 154 పరుగులు జోడించారు. ఫకర్ జమాన్(106), బాబర్ అజామ్ (47) క్రీజ్ లో ఉన్నారు.
మ్యాచ్ రద్దయితే పాక్ విజయం
సాధారణంగా 402 పరుగుల టార్గెట్ అంటే ఏ జట్టుకైనా సవాల్ తో కూడుకున్నదే. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూసుకుంటే పాక్ కు అనుకూలంగా ఉంది. ప్రస్తుతం వర్షం కురుస్తుండడంతో ఈ మ్యాచ్ ను నిలిపివేశారు. ఒకవేళ భారీ వర్షంతో మ్యాచ్ గనుక జరగకపోతే పాక్ విజేతగా నిలుస్తుంది. డక్ వర్త్ లూయిస్ ప్రకారం 20 ఓవర్లకు పాకిస్థాన్ స్కోర్ 142 పరుగులు చేయాల్సి ఉంది. కానీ పాక్ అప్పటికే 152 పరుగులు చేసింది. ఇక 21 ఓవర్లకు ఎలా చూసుకున్న 150 పరుగుల లోపే ఉండే అవకాశం ఉంది. మరో మూడు బంతులకు 5 పరుగుల చొప్పున వేసుకున్న మొత్తం 21.3 ఓవర్లలో పాక్ టార్గెట్ 155 అవుతుంది. కానీ పాక్ మాత్రం 21.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 160 పరుగులు చేసి ముందంజలో నిలిచింది.
కివీస్ భారీ స్కోర్
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది. రచీన్ రవీంద్ర(108) తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ ఈ టోర్నీలో మరో సెంచరీ చేస్తే, రీ ఎంట్రీలో కెప్టెన్ విలియంసన్ 95 పరుగులు చేసి తృటిలో సెంచరీ కోల్పోయాడు. ఓపెనర్ కాన్వే (35), మిచెల్(29), ఫిలిప్స్ (41), చాప్ మన్ (39), సాంట్నర్(26) తలో చేయి వేయడంతో పాక్ ముందు 402 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.