T20 World Cup 2024: ఫ్లోరిడాలో భారీ వర్షాలు.. పాకిస్థాన్ ఆశలు ఆవిరి!

T20 World Cup 2024: ఫ్లోరిడాలో భారీ వర్షాలు.. పాకిస్థాన్ ఆశలు ఆవిరి!

టైటిల్ తమదేనంటూ అమెరికాలో అడుగుపెట్టిన పాకిస్థాన్ కథ లీగ్ దశలోనే ముగిసేలా కనిపిస్తోంది. ఆఖరి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై గెలిచి సూపర్-8కు చేరాలనుకున్న పాకిస్థాన్ ఆశలు ఆవిరయ్యేలా కనిపిస్తున్నాయి. ఈ కీలక పోరుకు వరుణుడి ముప్పు పొంచి ఉంది. 

తొలి మ్యాచ్‍లో అమెరికా చేతిలో ఓడిన బాబర్ ఆజమ్ సేన.. అనంతరం రెండో పోరులో భారత్ చేతిలో పరాజయం పాలైంది. ఆ తరువాత పుంజుకొని కెనడాపై విజయం సాధించి సూపర్-8 ఆశలను సజీవంగా నిలుపుకుంది. అయితే, పాకిస్థాన్ సూపర్-8 చేరాలంటే తదుపరి ఆదివారం(జూన్ 16) ఐర్లాండ్‍తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించాలి. అంతేకాదు, మరో మ్యాచ్‌లో ఐర్లాండ్‍ చేతిలో అమెరికా ఓటమి పాలవ్వాలి. ఈ రెండూ జరగపోయినా, ఏ ఒక్కటి రద్దయినా పాక్ ఇంటికెళ్లడం ఖాయం. ఇప్పుడు వారిని ఇదే భయం వెంటాడుతోంది.

ఫ్లోరిడాలో ఎమర్జెన్సీ

వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరగాల్సిన ఫ్లోరిడాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం ఎమ‌ర్జెన్సీని విధించింది. అత్యవ‌స‌రమైతే త‌ప్ప ప్రజ‌ల‌ను ఇళ్లనుంచి బ‌య‌ట‌కు రావొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు.  మ‌రో వారం రోజులు పాటు ఇదే ప‌రిస్థితి ఉంటుందని వాతావరణ నివేదికల  వెల్లడిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో మ్యాచ్ జరగడం కాస్త అనుమానంగానే ఉంది.

సూపర్-8కు భారత జట్టు

గ్రూప్-ఏలో భారత జట్టు ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్‍ల్లో అన్నింటా గెలిచి సూపర్-8కు అర్హత సాధించింది. మరో బెర్త్ కోసం.. అమెరికా, పాకిస్తాన్ పోటీలో ఉన్నాయి. మూడు మ్యాచ్‍ల్లో రెండింట గెలిచి అమెరికా రెండో స్థానంలోఉండగా.. మూడింట ఒకటి గెలిచి పాకిస్థాన్ మూడో స్థానంలో ఉంది. కెనడా, ఐర్లాండ్‍ జట్లు ఇప్పటికే నిష్క్రమించాయి. గ్రూప్-ఏ దశలో ఇంకా మూడు మ్యాచ్‍లు జరగాల్సి ఉండగా.. ఆ మూడు ఫ్లోరిడాలోని లౌడర్‌హిల్‍ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.

ఫ్లోరిడాలో మ్యాచ్‍లు

  • జూన్ 14: అమెరికా vs ఐర్లాండ్
  • జూన్ 15: భారత్ vs కెనడా
  • జూన్ 16: పాకిస్థాన్ vs ఐర్లాండ్