
రావల్పిండి: చాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్‌పై కన్నేసిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాకు నిరాశ తప్పలేదు. మంగళవారం ఇరు జట్ల మధ్య జరగాల్సిన ఈ గ్రూప్–బి పోరు వర్షం కారణంగా రద్దయింది. దాంతో ఇరు జట్లూ చెరో పాయింట్ ఖాతాలో వేసుకున్నాయి. కనీసం టాస్ కూడా సాధ్యం కాలేదు. దాంతో కటాఫ్ టైమ్ అయిన రాత్రి 7.32 గంటల వరకు వేచి చూసిన మ్యాచ్ అధికారులు ఆటను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
ప్రస్తుతం ఇరు జట్లూ చెరో మూడు పాయింట్లతో నిలిచాయి. తమ ఆరంభ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్‌పై సౌతాఫ్రికా విజయం సాధించాయి. తాజా పోరులో నెగ్గే జట్టుకు సెమీఫైనల్ బెర్తు లభించేది. కానీ, ఈ మ్యాచ్ రద్దవడంతో గ్రూప్–బిలో సెమీఫైనల్ రేసు రసవత్తరంగా మారనుంది. బుధవారం ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్ మ్యాచ్ నాకౌట్ పోరు కానుంది. ఇందులో ఓడే జట్టు టోర్నీ నుంచి నిష్ర్కమిస్తుంది.