ఫ్లైఓవర్ల పైనుంచి వాన నీరు దిగట్లే

ఫ్లైఓవర్ల పైనుంచి వాన నీరు దిగట్లే
  •  ఎక్కడికక్కడ మట్టి పేరుకుపోయి పైపులు జామ్
  • చిన్నపాటి వానకే ఫ్లైఓవర్లపై నిలబడుతున్న నీళ్లు
  • వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు
  • నిర్వహణ లోపంతోనే సమస్య అంటున్న వాహనదారులు

హైదరాబాద్, వెలుగు:  సిటీలోని ఫ్లైఓవర్లను రెగ్యులర్​గా క్లీన్​ చేయడం లేదు. ఫలితంగా వాన నీరు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన పైపులు దుమ్ము, ధూళి, మట్టితో పూడుకుపోతున్నాయి. చిన్నపాటి వాన కురిసినా నీళ్లు కిందికి దిగే పరిస్థితి ఉండడం లేదు. ఫ్లైఓవర్​పైనే నీరు నిలబడుతోంది. దీంతో గంటల తరబడి వాహనాల రాకపోకలు నిలిచిపోతున్నాయి. మెయింటెనెన్స్ లోపంతోనే ఈ సమస్య ఏర్పడుతోందని అధికారులు భావిస్తున్నారు. రెగ్యులర్ గా క్లీన్ చేస్తే పైపులు బ్లాక్​అవ్వవని చెబుతున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై మోకాలు లోతున నీరు చేరింది. ఆ సమయంలో వాహనాల రాకపోకలు చాలా ఇబ్బందిగా మారింది. పంజాగుట్ట ఫ్లైఓవర్ పైనా ఇదే పరిస్థితి నెలకొంది. కొత్తగా నిర్మించిన వీఎస్టీ ఫ్లైఓవర్​పై కూడా వాన నీరు నిలిచింది. తెలుగు తల్లి ఫ్లైఓవర్, మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ల పైకి ఎక్కేచోట, దిగేచోట భారీగా వరద నీరు నిలుస్తోంది. వర్షం ఆగినా వరద నీరు కిందికి వెళ్లడం లేదు. జనం ఇబ్బందులు పడుతున్నారు. 

సీఆర్ఎంపీ ఏజెన్సీల నిర్లక్షమే

ఫ్లైఓవర్లను రెగ్యులర్​గా క్లీన్​చేయాల్సిన సీఆర్ఎంపీ ఏజెన్సీలు పట్టించుకోవడంలేదు. నామ్ కే వాస్తేగా పనులు చేస్తుండటంతో ఫ్లైఓవర్లపై వరద నీరు నిలిచిపోతుంది. ఎల్బీనగర్, -కాప్రా, ఉప్పల్, హిమాయత్ నగర్, ఎల్బీనగర్, సరూర్ నగర్, చార్మినార్,- మలక్ పేట, సంతోష్ నగర్, చాంద్రాయణగుట్టలోని రహదారులను బీఎస్​సీపీఎల్ ఇన్ ఫ్రా ఏజెన్సీ, చార్మినార్, ఫలకనుమా, రాజేంద్రనగర్ రహదారులను ఎం.వెంకటరావు ఇన్ ఫ్రా కు, ఖైరతాబాద్-–1,  మెహిదీపట్నం, కార్వాన్, గోషామహల్, సికింద్రాబాద్, బేగంపేట ప్రాంతాల్లోని రహదారులను కేఎన్ఆర్ కన్ స్ట్రక్షన్ లిమిటెడ్​కు, ఖైరతాబాద్–-2/ ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, యూసఫ్​గూడ, శేరిలింగంపల్లి, గాజులరామారం, అల్వాల్, సికింద్రాబాద్, ముషీరాబాద్, అంబర్ పేట, మల్కాజిగిరి ప్రాంతాల్లోని రోడ్లను మేఘ ఇంజనీరింగ్ ఇన్ ఫ్రా కు, చందానగర్, ఆర్సీపురం, పటాన్ చెరు, కూకట్ పల్లి, మూసాపేట, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లోని రోడ్లను ఎన్​సీసీ లిమిటెడ్ ఏజెన్సీలకు అప్పగించారు. ఈ రోడ్లపై  ఏదైనా సమస్యలుంటే కాల్ చేసేందుకు ఫోన్ నెంబర్లతో బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ ఆ నెంబర్లకి కాల్ చేసినా రెస్పాన్స్ ఉండటం లేదు.

వేలాది కోట్లు ఖర్చు

ఎస్ఆర్డీపీ ఫస్ట్​ఫేజ్​లో భాగంగా రూ.5,937 కోట్లతో మొత్తం 42 పనులు చేపట్టగా 8 పనులు ఇంకా కొనసాగుతున్నాయి. మొదటి విడత ఎస్ఆర్డీపీ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇన్నికోట్లు ఖర్చు పెట్టి ఫైఓవర్లు నిర్మిస్తున్నా, చిన్న సమస్యతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు వర్షాల సమయంలో వాహనాలు వెళ్లేందుకు వీలు లేకుండా పోతున్నాయి. ఈ షయంపై ఉన్నతాధికారులు దృష్టిపెట్టి చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. లేకపోతే వానాకాలంలో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మెయింటెనెన్స్ లేకపోవడంతోనే ఫ్లైఓవర్లపై నీళ్లు నిలుస్తున్నాయని, ఇకపై రెగ్యులర్​గా క్లీన్​చేయిస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు.