తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు వర్షాలు..!

తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు వర్షాలు..!

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌లో గాలివాన బీభత్సం సృష్టించింది. పొద్దంతా ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేయగా, సాయంత్రం 4 గంటలకు  క్యుములోనింబస్​మేఘాలు కమ్ముకుని వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆ వెంటనే మొదలైన వాన.. గంటన్నరపాటు దంచికొట్టింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌‌‌‌పేట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, పంజాగుట్ట, సికింద్రాబాద్, కూకట్‌‌పల్లి, బషీర్‌‌‌‌బాగ్, అల్వాల్, బాలానగర్, ఓల్డ్​సిటీలో గాలి దుమారంతో పాటు వడగండ్ల వాన కురిసింది. 

గచ్చిబౌలి, హైటెక్​సిటీ, కొండాపూర్, నార్సింగిలో గాలిదుమారం రేగింది. కోకాపేటలోని ఓ భారీ టవర్​ వద్ద సుడిగాలి బీభత్సం సృష్టించింది. ఈదురుగాలుల ధాటికి సిటీలోని చాలా చోట్ల చెట్లు నేలకొరిగాయి. కరెంట్​స్తంభాలు కూలిపోయాయి. వర్షం ధాటికి రోడ్లపై ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయాయి. ఆఫీసులు అయిపోయే సమయం కావడం.. వెహికల్స్​రోడ్లపైకి ఎక్కువగా రావడంతో ఎక్కడికక్కడ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌‌లు ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల విద్యుత్​ స్తంభాలు కూలడం, విద్యుత్​ లైన్లు తెగిపోవడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది.

హైదరాబాద్‌‌లోని కంచన్‌‌బాగ్‌‌లో అత్యధికంగా 8.1 సెంటీమీటర్ల వర్షం పడింది. బహదూర్‌‌‌‌పురాలో 7.9, యాకుత్‌‌పురా రెయిన్‌‌బజార్‌‌‌‌లో 7.6, బేగంబజార్‌‌‌‌లో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరోవైపు పలు జిల్లాల్లోనూ మోస్తరు వానలు కురిశాయి. ఈదురుగాలులు వీచాయి. యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజాబాద్, నిర్మల్, వికారాబాద్, నారాయణపేట, నాగర్​కర్నూల్​ జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. 

మరో ఐదు రోజులు వానలు

రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడే చాన్స్ ఉందని తెలిపింది. శని, ఆదివారాల్లో 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్​మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌‌నగర్, నాగర్‌‌‌‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది.

గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, పలుచోట్ల వడగండ్లు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే, వర్షాలు పడినా టెంపరేచర్లు కూడా అంతే పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే ప్రమాదం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంటుందని పేర్కొంది. 

ఆదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్​జిల్లాలకు ఆరెంజ్​అలర్ట్​ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్​ఉందని తెలిపింది. కాగా, శుక్రవారం నిజామాబాద్​జిల్లాలో అత్యధికంగా 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్​అయినట్టు వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్‌‌లో 41.3, మెదక్‌‌లో 40.2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపింది.