
భూపాలపల్లి, ములుగు జిల్లాలలో రెండు రోజులుగా ఎడతెరపిలేని వానలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కన్నాయిగూడెం, వెంకటాపూర్ , తాడ్వాయి మండలాలలో అత్యధికంగా 9 సెం.మీ వర్షం కురిసింది. గోవిందరావుపేట, వెంకటాపురం, వాజేడు, మంగపేట మండలాలలో 8 సెం.మీ వర్షపాతం నమోదైంది. గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. బస్సులను ఆఫీసర్లు రద్దు చేశారు. ఏటూరునాగారం, ఆకులవారిఘనపూరం, మానసపల్లి, లో డ్రైనేజీ నిండాయి, కాలనీలు జలమయం అయ్యాయి.
మరో మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం వీరాపురం గ్రామానికి చెందిన గర్భిణి సోలం వాణీ అంబులెన్స్‌లో మండల కేంద్రానికి వచ్చే క్రమంలో ఎలిశెట్టిపళ్లి, చల్పాక గ్రామాల మధ్య జంపన్న వాగు ఉధృతంగా ప్రవహించడంతో పోలీసులు ఆమెను సురక్షితంగా వాగు దాటించారు. తెలంగాణ, చత్తీస్గడ్, మహారాష్ట్ర కురుస్తున్న వర్షాలకు గోదావరిలో వరద నీరు చేరుకుంటుంది.
- జయశంకర్ భూపాలపల్లి, వెలుగు