ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆగని వాన

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆగని వాన
  • రెండ్రోజులుగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ముసురు
  •  పొంగిపొర్లుతున్న వాగులు.. నిండుతున్న చెరువులు
  •  నీట మునిగిన పంటలు.. రాకపోకలకు అంతరాయం

ఖమ్మం/నెట్​వర్క్​, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండ్రోజులుగా ముసురు ఆగకుండా కురుస్తోంది. చెరువుల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది.  ఖమ్మం జిల్లాలో 984 చెరువులకు గాను ఇప్పటి వరకు 28 చెరువులు అలుగుపోస్తున్నాయి. 401 చెరువులు 75 శాతం నుంచి 100 శాతం వరకు నిండగా, 165 చెరువులు 50 నుంచి 75 శాతం వరకు నిండాయి. 249 చెరువులు 25 నుంచి 50 శాతం వరకు, 141 చెరువులు 25 శాతం వరకు నిండాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2,144 చెరువులకు గాను 175 చెరువులు అలుగు పోస్తున్నాయి. 1,813 చెరువులు 75 శాతం నుంచి 100 శాతం నిండగా, 88 చెరువులు 50 నుంచి 75 శాతం, 68 చెరువులు 25 నుంచి 50 శాతం వరకు నిండాయి. 

సాధారణం కంటే అధిక వర్షపాతం.. 

ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు సాధారణం కంటే 39 శాతం అధిక వర్షపాతం నమోదైంది. సాధారణం 426.8 మి.మీటర్లకు గాను, 592.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 21 మండలాలకు గాను 17 మండలాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా, మిగిలిన నాలుగు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఇక ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలం గంగారంలో బుధవారం ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా 108.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెల్లపాడులో 80.3, మద్దుకూరులో 80.3, నాగుపల్లిలో 76.3 మిల్లీమీటర్ల వర్షం పడింది. భద్రాచలంలో 62.3, మల్కారంలో 59 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

ఆయా ప్రాంతాల్లో పరిస్థితి.. 

  • కల్లూరు మండలం అడవి బోడెమల్లె గ్రామంలో రేకుల ఇల్లు కూలిపోయింది. వంకర వాగు ద్వారా కల్లూరు పెద్ద చెరువులోనికి పెద్ద ఎత్తున వరద నీరు చేరి అలుగు పోస్తోంది. కల్లూరు నుంచి లక్ష్మీపురం, పెద్ద చెరువు ఆయకట్టుకు వెళ్లే ఆర్ అండ్ బీ రహదారి మధ్యలో లో లెవల్ వాగు పైనుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రజలు వంతెన పైనుంచి  వెళ్లకుండా గ్రామపంచాయతీ ట్రాక్టర్, బారికేడ్లు అడ్డం పెట్టారు.
  •     అశ్వాపురం మండలంం గొంది గూడెం గ్రామం వద్ద ఇసుక వాగు పొంగి ప్రవహిస్తున్నందున రాకపోకలు నిలిచిపోయాయి. గొందిగూడెం, కొత్తూరు గ్రామాల ప్రజలు కొత్తగూడెం మణుగూరు రైల్వే వంతెన మీదుగా రాకపోకలు కొనసాగిస్తున్నారు. 
  • పాల్వంచ మండల పరిధిలోని నాగారం, జగన్నాధపురం తదితర గ్రామాలలో రైతులు వేసిన వరి, పత్తి  పొలాలు నీట మునిగాయి.  కిన్నెరసాని, పాండురంగాపురం గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. రాజాపురం వద్ద కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు పూర్తి కాకపోవడంతో పాండురంగపురం, ఉల్వనూరు, యానం బైల్ ఇతర గ్రామాల ప్రజలు పాల్వంచ పట్టణానికి చేరుకోలేకపోతున్నారు. పాల్వంచ పట్ట ణంలోని వెంకటేశ్వర హిల్స్ కాలనీ, ఒడ్డు గూడెం లలో నివాసాల్లోకి భారీగా నీళ్లు చేరాయి. 
  •  చండ్రుగొండ మండలం గానుగపాడు, అన్నారం తండాల మధ్య  వాగు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామాల మధ్య రాకపోకలు  నిలిచి పోయాయి. వాగు పైన రూ.2 కోట్ల అంచనా తో  నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు నత్తనడకన చేయడంతో గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. తిప్పనపల్లిలోని పీఎస్ స్కూల్ క్లాస్ రూమ్​ల్లో చేరిన వరద నీటిని ఎంపీడీవో అశోక్, పీఆర్డీఈ సైదిరెడ్డి పరిశీలించారు.  
  • కరకగూడెం మండలం పరిధిలో పంట పొలాలు నీట మునిగి చెరువులను తలపించాయి. ప్రమాదకరంగా  ఉన్న  బ్రిడ్జీలు, రహదారులను తహసీల్దారు నాగప్రసాద్​, కరకగూడెం ఎస్సై  రాజేందర్​ పరిశీలించి ప్రత్యేక సిబ్బందిని కాపలా ఉంచారు. 
  • అశ్వారావుపేట వాగొడ్డుగూడెం గ్రామ శివారులో అంకమ్మ చెరువు అలుగు ఉధృతంగా మారడంతో బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. తహసీల్దార్ కృష్ణ ప్రసాద్ పర్యవేక్షించారు. 
  • ములకలపల్లి మండలం ముత్యాలంపాడు పాలవాగు, ములకలపల్లి పాములేరు వాగు, కుమ్మరిపాడు, అన్నారం, రాచన్నపేట, కమలాపురం, పొగళపలి, తిమ్మంపేట గ్రామాలలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బూర్గంపాడు వైపు నుంచి ములకలపల్లికి పల్సర్ బైక్ పై ఓ జంట వస్తు రాళ్ళవాగు వరదకు జారి కింద పడిపోగా స్థానికులు రక్షించారు. ములకలపల్లి లోని రాయికుంట, గన్నేరుచెరువు, దమ్మన్నకుంట చెరువులు అలుగులు పారడంతో ఆయకట్టు వరి పొలాలు చెరువులను తలపించాయి. కమలాపురం పెద్దయ్య చెరువు అలుగు పారడంతో రోడ్డు పూర్తిగా 
  • కొట్టుకుపోయింది. 
  • అన్నపురెడ్డిపల్లి మండలం ఎదుళ్ళవాగు పొంగడంతో అబ్బుగూడెం, కట్టుగూడెం, వెంకటాపురం, సత్తుపల్లి వైపు వెళ్లే  రహదారిని మూసివేశారు. తాహసీల్దార్  జగదీశ్వర ప్రసాద్​వరద పరిస్థితులను పరిశీలించారు. 
  • జూలూరుపాడు మండలం అన్నారుపాడు-, గుండ్లరేవు, పడమట నర్సాపురం, బేతాలపాడు మధ్య తుమ్మలవాగు బిడ్జిపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. 
  •  ఖమ్మం నగరంలోని జడ్పీ సెంటర్, ఓల్డ్ బస్టాండ్ సెంటర్, కాల్వ ఒడ్డు ఏరియాలలో వర్షపునీటితో డ్రైనేజ్ లు నిండి రోడ్లపై మురుగునీరు 
  • ప్రవహించింది..
  • కామేపల్లి మండలంలోని బండిపాడు గ్రామం వద్ద ఉన్న బుగ్గ వాగు భారీ వర్షాలకు పొంగి ప్రవహించడంతో ఖమ్మం–మహబూబాద్ జిల్లాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. బుగ్గవాగు  ప్రవాహాన్ని తహసీల్దార్ సుధాకర్ ఎంపీడీవో రవీందర్ ఐబీ ఏఈ వినోద్ 
  • పరిశీలించారు‌‌‌‌‌‌‌‌.