బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రెండు తెలుగు రాష్ట్రా్ల్లో వర్షాలు కురుస్తున్నాయి. వాయు గుండం ప్రభావంతో తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, హైదరాబాద్ జిల్లా్ల్లో వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపింది. వాతావరణ కేంద్ర అంచనాలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాలను ప్రజలను అలర్ట్ చేసింది. భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను అప్రమత్తం చేసింది.
ALSO READ | హైదరాబాదీలు బీ అలర్ట్: ఈసారి చలి చంపేస్తుంది.. అలా ఇలా కాదంట..!
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్లోనూ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్ని ప్రాంతాలకు భారీ నుండి అతిభారీ వర్షసూచన ఉన్నట్లు తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు (ఫ్లాష్ ఫ్లడ్) సంభవించే అవకాశం ఉందని పేర్కొంది.
భారీ వర్షాలు కురిసే అశకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పెన్నా నది పరీవాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అలర్ట్ చేసింది. సహాయక చర్యల కోసం జిల్లాల్లో 5 ఎస్డీఆర్ఎఫ్, 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ప్రభుత్వం రంగంలోకి దింపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం చెన్నైకి 280 కి.మీ, పుదుచ్చేరికి 320 కి.మీ, నెల్లూరుకి 370కి.మీ దూరంలో కేంద్రీకృతమై.. పశ్చిమ వాయువ్య దిశగా 15కిమీ వేగంతో కదులుతున్నట్లు వెల్లడించింది.