ఖమ్మం జిల్లాలో రైతులకు ముసురు టెన్షన్​

ఖమ్మం జిల్లాలో రైతులకు ముసురు టెన్షన్​

ఖమ్మం/భద్రాద్రికొత్తూగూడెం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వాన ముసురు రైతులను టెన్షన్​ పెట్టిస్తోంది. మంగళవారం సాయంత్రం నుంచి జిల్లాలోని పలు చోట్ల తేలిక పాటి జల్లులు, అక్కడక్కడా వర్షం కురుస్తుండడం కలవరపెడుతోంది. మధిర, వైరా నియోజకవర్గాల్లో ఇంకా వరి పొలాలు కోతలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే వరికోతలు పూర్తయిన రైతులు కొనుగోలు  కేంద్రాల్లో ధాన్యం రాశులను పోసి అమ్మకానికి ఉంచారు. 

తేమ శాతం ఎక్కువగా ఉండడంతో ఆరబెడుతుండగా, రెండు రోజుల నుంచి వాతావరణం మారడం ఆందోళన కలిగిస్తోంది. ఎర్రుపాలెంలో పలు చోట్ల రెండ్రోజుల నుంచి కాంటాలు నిలిపేశారు. కామేపల్లి, కూసుమంచి, కల్లూరు, అశ్వరావుపేట చండ్రుగొండ, పాల్వంచ లక్ష్మీదేవి పల్లి, అన్నపురెడ్డిపల్లి ములకలపల్లి మండలాల పరిధిలో రైతులు వానజల్లులతో అవస్థలు పడుతున్నారు. తుఫాన్ హెచ్చరికతో రైతులు అప్రమత్తమై వర్షం వస్తే ధాన్యం తడవకుండా పరదాలు కప్పుకున్నారు.