- నష్టాల్లో వరి రైతు,కోత ఖర్చులు డబుల్
జనగామ, వెలుగు: చెడగొట్టు వానలకు చేతికి అందివచ్చిన పంటలు నేలకొరిగాయి. జిల్లాలో అకాలంగా కురిసిన వానలకు వరి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎక్కడికక్కడ పంటలు అడ్డం పడ్డాయి. జిల్లాలో సుమారు 500 ఎకరాలకు పైగా వరి పంట అడ్డంపడ్డట్లు రైతులు వాపోతున్నారు. బుధవారం ఆర్ధరాత్రి కురిసిన వానకు రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపూర్, ఫతేషాపూర్, కంచనపల్లి, ఖిలాషాపూర్, లక్ష్మీతండా గ్రామాల్లో పొలాలు నీటమునిగాయి.
స్టేషన్ ఘన్పూర్ మండలం విశ్వనాథపురం, తానేదార్ పల్లి తదితర గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లాలో సగానికి పైగా రైతులు తడులు మానేశారు. వారం పది రోజుల్లో కోతలు ముమ్మర దశకు చేరుకోనుండగా వానలతో మడులు ఆరడం లేదు. దీనికి తోడు అడ్డం పడ్డ వరి పరిస్థితి మరింత ఇక్కట్లు కలిగిస్తోంది. ఈ వరిని బురదలో కొయ్యాలంటే చైన్ కోత మిషన్ గంటకు రూ. 3200ల నుంచి రూ. 3500ల వరకు చార్జ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ లెక్కన ఎకరం వరి కోసేందుకు 5 వేల వరకు ఖర్చు వచ్చే పరిస్థితి ఉందంటున్నారు.
మహబూబాబాద్ : రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలకు గార్ల, బయ్యారం, గంగారం కొత్తగూడ, గూడూరు మండలాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పత్తి ఏరుదామనుకున్న సమయంలో చేను పైనే పత్తి నల్లబడుతుంది. మిర్చి తోట లో వాననీరు పేరుకుపోయింది. జిల్లాలో వానాకాలం సీజన్ లో వరి పంటను 12794 3, పత్తి 97561 ,మొక్కజొన్న 3258 1, మిర్చి 42179 ఎకరాల్లో సాగుచేశారు. వర్షం వల్ల జరిగిన నష్టానికి పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
తీరని పంట నష్టం
నేను ఎనిమిదెకరాల్లో దొడ్డు రకం వరి వేసిన, పంటంతా ఈనే దశలో ఉంది. మరో నెల రోజుల్లో పంట చేతికి వచ్చేది. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి మొత్తం నేల వాలింది. ఇప్పటికే రెండున్నర లక్షల దాక పెట్టుబడి అయింది. పంట మంచిగా చేతికి వస్తే ఎకరాన 30 బస్తాలు పండేది. 8 ఎకరాలకు 240 బస్తాలు వడ్లు దిగుబడి వచ్చేది. ఇప్పడంతా ఆగమై తీవ్ర నష్టం వచ్చింది. - దుంపల పద్మారెడ్డి, తానేదార్ పల్లి గ్రామం, స్టేషన్ ఘన్పూర్ మండలం
సమస్యలు పరిష్కరించాలని ఏఎన్ఎంల ధర్నా
వరంగల్ సిటీ, వెలుగు : వరంగల్, హనుమకొండ జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ ఆఫీస్ ఎదుట ఏఎన్ఎంలు గురువారం ధర్నా చేశారు. పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే . యాదా నాయక్ మాట్లాడారు. ఏఎన్ఎం లకు కనీస వేతనం రూ. 31,040 చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏఎన్ఎంల సర్వీస్ రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
పోడు భూముల సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి
కలెక్టర్ శశాంక
మహబూబాబాద్ , వెలుగు: దరఖాస్తు చేసుకున్న ప్రతి క్లైమ్ ను సర్వే చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి హక్కు పత్రాలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. గంగారం మండలం తిరుమల గండి లో పోడు భూముల సర్వే ను కలెక్టర్ గురువారం తనిఖీ చేశారు. సాక్ష్యాధారాలను పకడ్భందీగా చూడాలని, ఇప్పటికే క్షేత్రస్థాయి సర్వే ప్రక్రియను పూర్తిస్థాయిలో ఆన్ లైన్ చేయాలని రెవెన్యూ అటవీశాఖ, మండల పరిషత్ ఆఫీసర్లు కలిసి నివేదికను గ్రామ సభలకు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ బాలరాజు, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, తహసిల్దార్ సూర్యనారాయణ, ఎఫ్ఆర్ వో ఎండి వజాహత్ ,ఎఫ్ఆర్ సి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఏజెన్సీ ఏరియాలో తనిఖీలు...
గంగారం మండలం కోమట్ల గూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ శశాంక తనిఖీ చేశారు. హస్పిటల్లో ప్రసవాల సంఖ్య తక్కువగా ఉందని, ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్ లకు వెళ్లడానికి కారణాలు తెలుసుకున్నారు. కోమట్లగూడెం ప్రైమరీ, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. ప్రహరీగోడ, మరుగుదొడ్లు, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అదనపు తరగతి గదుల పెండింగ్ పనులకు సంబంధించి అవసరమైన పనులకు ప్రతిపాదనలను ఇవ్వాలని ఇంజనీరింగ్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో డీఈవో అబ్దుల్ హై, మండల స్పెషల్ ఆఫీసర్ బాలరాజు, ఎంఈవో శ్రీదేవి, ట్రైబల్ వెల్ఫేర్ డీఈ రామి రెడ్డి పాల్గొన్నారు.
స్కూల్ బస్సు బోల్తా .. పిల్లలకు స్వల్ప గాయాలు
భీమదేవరపల్లి, వెలుగు: మండలంలోని రత్నగిరి శివారులో స్కూల్ బస్సు గురువారం బోల్తా పడింది. హుజూరాబాద్ పట్టణం మాంటిస్సోరి విద్యాసంస్థలకు చెందిన బస్సు ఉదయం రత్నగిరికి వెళ్తోంది. సుమారు 10మంది పిల్లలతో రత్నగిరి మట్టిరోడ్డులో ప్రయాణిస్తుండగా ఒక్కసారి కుడివైపు ఉన్న గుంతలో పడిపోయింది. చిన్నగా ఉన్న రోడ్డుపై చెట్టు కొమ్మ తప్పించబోయి ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. బస్సులో ఉన్న పిల్లలకు స్వల్ప గాయాలు అయ్యాయి.
సత్యనారాయణ రావు బర్త్ డే సెలబ్రేషన్స్
కమలాపూర్,వెలుగు : టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తక్కల్లపల్లి సత్యనారాయణ రావు బర్త్ డే సెలబ్రేషన్స్ గురువారం గ్రాండ్ గా జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటు బుక్సును పంపిణీ చేశారు. అనంతరం బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో కట్ చేసి లీడర్లకు అందజేశారు. మండల ప్రజాప్రతినిధులు, లీడర్లు సత్యనారాయణ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ ఎర్రం ఇంద్రసేనారెడ్డి, సీనియర్ నాయకులు కట్కూరి చంద్రారెడ్డి, దుర్వేశ్, అశోక్, శ్రీనాథ్, శ్రీను, శ్రావణ్, దిలీప్, తదితరులు ఉన్నారు.
మున్సిపల్లో అవినీతిని అరికట్టాలి
వర్ధన్నపేట, వెలుగు: వర్ధన్నపేట మున్సిపాలిటీలో అవినీతిని అరికట్టాలని, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండెటి శ్రీధర్ డిమాండ్ చేశారు. అవినీతిలో మున్సిపల్ కమిషనర్ , ఎమ్మెల్యే భాగస్వామ్యం ఉందని ఆరోపిస్తూ అంబేద్కర్ సెంటర్లో గురువారం ధర్నాచేశారు. అనంతరం శ్రీధర్ మాట్లాడుతూ చైర్పర్సన్ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని, తెల్ల పేపర్ల మీద సంతకాలు తీసుకున్న కమిషనర్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
అవినీతి జరుగకుంటే ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో విలేకర్ల సమావేశంలో ముగ్గురు అధికార పార్టీ కౌన్సిలర్లు ఎందుకు హాజరు కాలేదో చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చీటూరి అశోక్, కౌన్సిలర్ కొండేటి అనిత సత్యం, పట్టణ అధ్యక్షుడు చీటూరి రాజు, పట్టణ పూర్వ అధ్యక్షుడు కొండేటి సత్యం, జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బన్న ప్రభాకర్, మాదాసు రాజు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలె
జనగామ, వెలుగు : జిల్లాలో వరి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై గురువారం కలెక్టరేట్లో సమీక్ష లో ఆయన మాట్లాడుతూ.. త్వరగా ధాన్యం సెంటర్లకు వచ్చే ప్రాంతాలలో ముందుగా కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అంచనా ఉందన్నారు.
తేమ 17 శాతం ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు. ట్రాన్స్ పోర్ట్ సమస్య రాకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఏసీపీ దేవేందర్ రెడ్డి, డీఆర్ డీఓ రాంరెడ్డి, ఆర్డీఓ మధుమోహన్, సహకార శాఖ అధికారి కిరణ్ కుమార్, పౌర సరఫరాల అధికారి రోజా రాణి, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ సంధ్యారాణి, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా తీజ్ పండుగ
మహాముత్తారం, వెలుగు: మండలంలోని పెగడపల్లి, బోర్లగూడెం, యత్నారం, ప్రేమ్‌నగర్ తండాల్లో తీజ్ పండుగ గురువారం ఘనంగా ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు ఉపవాసం ఉండి ముగింపు రోజు సమీప చెరువుల్లో బతుకమ్మ తరహాలో నిమజ్జనం చేశారు. యువతుల ఆట పాటలు ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవాల్లో పెద్దపల్లి జడ్పీ చైర్మెన్, టీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇంచార్జి పుట్ట మధు సతీమణి పుట్ట శైలజ, తండా నాయకులు జాటోత్ పర్తినాయక్, యువతీ, యువకులు పాల్గొన్నారు.
కేయూ స్పోర్ట్స్ బడ్జెట్ రూ.3.67 కోట్లు
కేయూ క్యాంపస్ : 2022-– 23 సంవత్సరానికి కాకతీయ యూనివర్సిటీలో స్పోర్ట్స్ కోసం రూ.3.67 కోట్ల బడ్జెట్ కేటాయించారు. వీసీ తాటికొండ రమేశ్ అధ్యక్షతన గురువారం స్పోర్ట్స్ బడ్జెట్ మీటింగ్ నిర్వహించారు. మొత్తం రూ.3.675 కోట్లను వివిధ పద్దుల కింద కేటాయిస్తున్నట్లు స్పోర్ట్స్ సెక్రటరీ సవితా జ్యోత్స్న తెలిపారు. వర్సిటీ జిమ్ రిపేర్లు, కొత్త ఎక్విప్ మెంట్ కోసం రూ.15 లక్షలు, కొత్తగా స్పోర్ట్స్ కోర్టుల నిర్మాణానికి రూ.10 లక్షలు, ఇండోర్ కబడ్డీ గేమ్స్ కోసం రూ.5 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు.