కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, వెలుగు: నెల రోజుల ఆలస్యంగానైనా వానలు పడ్తుతుండడంతో పంటల సాగుపై రైతుల్లో ఆశలు చిగురించాయి. ఉమ్మడి జిల్లాలో ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు మత్తళ్లు దూకుతుండగా, ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. జూన్నెలంతా వాన లేకపోడంతో ఈసారి కాలం కాదనుకుని నిరాశలో ఉన్న రైతులను జులై ఆదుకుంది. ప్రస్తుతం కురుస్తున్న వానలతో అన్నదాతలు ఆనందంగా ఉన్నారు. ఎస్సారెస్పీ కాల్వలు, బోర్లు, బావుల కింద పూర్తి స్థాయిలో వరినాట్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.
వరి సాగుకే మొగ్గు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు నిండడంతో రైతులు సాగులో నిమగ్నమవుతున్నారు. కాగా ఈసారి కూడా వరి సాగుకే రైతులు మొగ్గుచూపుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 10లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నట్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఆంచనా వేస్తున్నారు. కరీంనగర్జిల్లాలో మొత్తం 3.39లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా 2.72 లక్షల్లో వరి, 48వేల ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న 4,500 ఎకరాలు, పెసర వెయ్యి ఎకరాలు, కందులు 2,500 ఎకరాల్లో సాగవనున్నట్లు అంచనా. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 2.40 లక్షల ఎకరాల సాగుభూమి ఉండగా వరి1.62 లక్షలు, పత్తి, 74, 492 ఎకరాలు, పెద్దపల్లి జిల్లాలో 3.50 లక్షల ఎకరాల సాగు భూమిలో వరి 2.80 లక్షలు, పత్తి 80వేలు, జగిత్యాల జిల్లాలో మొత్తం 4.34లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా వరి 2.30 లక్షలు, పత్తి 1.20 లక్షలు, ఇతర పంటలు 1.14లక్షల ఎకరాల్లో సాగవనున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు.
వానలతో వ్యవసాయానికి ఊపిరి
ప్రస్తుతం కురుస్తున్న వానలతో వ్యవసాయానికి ఊపిరి పోసినట్లయింది. ఈసారి జూన్ నెలలో వానలు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. సకాలంలో వర్షాలు కురవకపోవడం, ఎండ తీవ్రతకు చాలా చోట్ల వేసిన పత్తి విత్తనాలు మాడిపోయాయి. నీళ్లు చల్లుతూ రైతులు పత్తి విత్తనాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కో రైతు ఎకరానికి రూ.10 వేల వరకు నష్టపోయారు. వర్ష సూచనతో ఇటీవల మరోసారి విత్తనాలు వేశారు. బోర్ల కింద వరి నార్లు పోసినా, పొలాలను కరగట్టు చేసేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలు పత్తి రైతులకు కొంత ఊరటనిచ్చింది.