సూర్యాపేటపై తుపాన్ ఎఫెక్ట్ .. రెడ్ అలర్ట్ జారీ చేసిన ప్రభుత్వం

  • మార్కెట్లకు సెలవు ఇచ్చిన అధికారులు
  •     కలెక్టరేట్‌‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

 సూర్యాపేట, వెలుగు:   తుఫాన్‌ ప్రభావంతో సూర్యాపేట జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి.  మంగళవారం జిల్లాకు రెడ్‌‌ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ మరో రెండు రోజుల పాటు  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.  కలెక్టరేట్‌‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

సూర్యాపేట, తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లకు సెలవు ప్రకటించి.. రెతులెవరూ వడ్ల తీసుకురావొద్దని సూచించారు.   తుపాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా 193.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.  మట్టంపల్లి మండలంలో 24.4 మి.మీ., పాలకీడు మండలంలో 22.8 మి.మీ.  , హుజూర్ నగర్  19.3 , చిలుకూరులో 16.8 , మేళ్లచెర్వులో 14.3 , చింతలపాలెంలో 12.7 , మునగాలలో 12.5 , నడిగూడెంలో 12.0 , నేరేడు చర్లలో  9.1 , కోదాడలో 8.2 , గరిడే పల్లిలో 7.7 , పెన్ పహాడ్‌‌లో  7.6 , అనంతగిరిలో 6.5 , మోతేలో 5.5 , ఆత్మకూర్(ఎస్)లో 3.8 , సూర్యాపేటలో 2.8 , నూతనకల్‌‌లో  2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.  

ప్రజలు అలర్ట్‌‌గా ఉండాలి:  కలెక్టర్  వెంకట్‌‌రావు


భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  కలెక్టర్ వెంకట్‌‌రావు సూచించారు. వర్షాలకు తోడు చలిగాలులు వీస్తున్నందున అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని, వచ్చినా మట్టి గోడలు, కరెంట్‌‌ స్తంభాలకు దూరంగా ఉండాలన్నారు. రైతులు పొలం పనులకు వెళ్లవద్దని, వెళ్లినా చెట్ల కింద ఉండొద్దని సూచించారు.

ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైనా.. తక్షణ సమాచారం కావాలన్నా కలెక్టరేట్‌‌లో ఏర్పాటు చేసిన  కంట్రోల్ రూమ్ నెంబర్‌‌‌‌ 6281492368 కు  ఫోన్ చేసి తెలుసుకోవాలని కోరారు. వర్షాల వల్ల  వ్యాధులు ప్రభలే ప్రమాదం ఉన్నందున అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు అందుబాటులో ఉండాలన్నారు.  జిల్లాలో మిగిలిపోయిన వానాకాలం ధాన్యాన్ని  వెంటనే కొనుగోలు చేయాలని డీఆర్‌‌‌‌డీఏ పీడీ   కిరణ్ కుమార్, డీఎంవోను ఆదేశించారు.  గ్రామాలలో పంచాయతీ సెక్రటరీలు గ్రామాల్లో నీళ్లు నిల్వ ఉండకుండా చూడాలన్నారు.  వర్షాలు తగ్గేంత వరకు అధికారులు హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లవద్దని ఆర్డర్స్ జారీ చేశారు. 

100కు కాల్‌‌ చేయండి: ఎస్పీ రాహుల్ హెగ్డే

 తుఫాన్‌‌  దృష్ట్యా  రైతులు, వాహనదారులు, ప్రయాణికులు  జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే కోరారు. అత్యవసర సమయాల్లో డయల్‌‌ 100కు కాల్ చేయాలని సూచించారు. ఈ మేరకు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశామని, ఏ సమయంలో కాల్ చేసినా వెంటనే స్పందిస్తారన్నారు.