
- నేడు, రేపు వడగండ్లు.. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
- ఆ తర్వాత రెండు రోజులు ఈదురుగాలులు, వాన.. ఎల్లో అలర్ట్
- 2 నుంచి 4 డిగ్రీలు తగ్గనున్న టెంపరేచర్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొద్ది రోజులపాటు ఎండలు తగ్గనున్నాయి. అటు చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర మీదుగా ఉపరితల ఆవర్తనం, దానికి ఆనుకుని ద్రోణి.. ఇటు మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు మీదుగా మరో ఆవర్తనం కొనసాగుతుండడంతో రాష్ట్రంలో బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు వడగండ్లతోకూడిన వర్షాలు పడనున్నాయి.
బుధవారం, గురువారం వడగండ్లతో పాటు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆ రెండు రోజులకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. బుధవారం ఏడు జిల్లాలకు.. ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది.
గురువారం 14 జిల్లాలు.. ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాలకు ఆరెంజ్ అలర్ట్ విడుదల చేసింది. ఆ రెండు రోజుల పాటు ఆయా జిల్లాల్లో వడగండ్లు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ తర్వాత శుక్రవారం, శనివారం రెండు రోజులు కూడా గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ఇష్యూ చేసింది. హైదరాబాద్‌లోనూ గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నాలుగు రోజుల పాటు టెంపరేచర్లు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
గత ఏడాదితో పోలిస్తే తక్కువే..
రాష్ట్రంలో మంగళవారం అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 12 జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 41.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. నల్గొండలో 41.4, భద్రాద్రి, జోగుళాంబ గద్వాలలో 41.3, మంచిర్యాల, నిర్మల్జిల్లాల్లో 41.2, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, వికారాబాద్జిల్లాల్లో 41.1, ములుగు, జగిత్యాల జిల్లాల్లో 41 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు నమోదయ్యాయి.
మిగతా జిల్లాల్లో 40 నుంచి 40.8 మధ్య ఉష్ణోగ్రత రికార్డయింది. అయితే, నిరుడు ఇదే టైంతో పోలిస్తే.. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉన్నాయి. నిరుడు ఇదే టైంకు ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల మార్క్‌ను దాటాయి. 19 జిల్లాల్లో 42 డిగ్రీలకన్నా ఎక్కువ టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయి. నిరుటితో పోలిస్తే ఇప్పుడు టెంపరేచర్లు కాస్తంత తక్కువగా నమోదయ్యాయి.