తెలంగాణలో ఐదు రోజులు వానలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో ఐదు రోజులు వానలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

 

  • నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే చాన్స్
  • పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
  • ఉత్తర తెలంగాణలో పెరుగుతున్న టెంపరేచర్లు.. ఆదిలాబాద్ జిల్లా అర్లి (టి)లో 43.9 డిగ్రీలు
  • నేడు, రేపు ఎండలు పెరుగుతాయన్న వాతావరణ శాఖ

హైదరాబాద్/ఆదిలాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. బుధవారం ఏర్పడే అల్పపీడన ప్రభావంతో మోస్తరు వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ మంగళవారం వెల్లడించింది. బుధవారం ఏర్పడే అల్పపీడనం.. శుక్రవారం నాటికి వాయుగుండంగా మారి బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్​గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్​, కామారెడ్డి, మహబూబ్​నగర్​ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 

నైరుతి మరింత ముందుకు

నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు కదిలా యి. అరేబియా సముద్రంలోని ఈశాన్య ప్రాంతాలకు నైరుతి రుతు పవనాలు విస్తరించినట్టు ఐఎండీ ప్రకటించింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో ఇటు అరేబియా, అటు బంగాళాఖాతంలో సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడినట్టు పేర్కొంది. ఇదే ప్రస్తు తం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడానికి కారణమవుతుందని తెలిపింది. దీని ప్రభావంతోనే తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. 

భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రెండు రోజుల కిందటి వరకు రాష్ట్రంలో 40 డిగ్రీలలోపే టెంపరేచర్లు నమోదుకాగా.. ప్రస్తుతం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా అర్లి(టి)లో 43.9 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయింది. నిజామాబాద్ జిల్లాలోని వైలపూర్​లో 43.4 డిగ్రీలు, మంచిర్యాల జిల్లాలోని కొండాపూర్​లో 43.4 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా బేల మండలం చప్రాలలో 43.2 డిగ్రీలు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 43.2 డిగ్రీలు, ఆదిలాబాద్ అర్బన్​లో 43.1 డిగ్రీలు, నిర్మల్ జిల్లా మామడలో 42.9 డిగ్రీలు, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 42.9 డిగ్రీలు, జగిత్యాల జిల్లాలోని అల్లిపూర్​లో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం, గురువారం కూడా కొన్ని జిల్లాల్లో 43 నుంచి 45 డిగ్రీల టెంపరేచర్లు నమోదవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.