తెలంగాణలో మూడు రోజులు వానలు... పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్​

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు.. మిగతాచోట్ల ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడే చాన్స్​ ఉందని వెల్లడించింది. మరోవైపు ఆదివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్​లో పలుచోట్ల వర్షం కురిసింది. 

అత్యధికంగా జయశంకర్​ జిల్లా చేల్పూరులో 6.2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో 4.6, భూపాలపల్లిలో 4.4, నిర్మల్​ జిల్లా కద్దం పెద్దూరులో 4.2, భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్​లో 3.9, సిద్దిపేట జిల్లా రాఘవాపూర్​లో 3.9, మంచిర్యాల జిల్లా భీమారంలో 3.5, కుమ్రంభీం జిల్లా జైనూరులో 2.7, ములుగు జిల్లా మంగపేటలో 2.7 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. ఇటు జీహెచ్ఎంసీ పరిధిలోని హయత్​నగర్​లో 2.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హయత్​నగర్​ డిఫెన్స్​ కాలనీలో 2, ఆస్మాన్​గఢ్​లో 1.5, హస్తినాపురంలో 1.4, సైదాబాద్​లో 1.2, సరూర్​నగర్​లో 1.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది.