
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో సెప్టెంబర్ 15వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల(సెప్టెంబర్ 13, 14, 15) పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
ఆవర్తన ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఉరములు, మెరుపులతో కూడిన తెలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం, బుధవారం(సెప్టెంబర్ 12, 13) భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది.
ఆరెంజ్ అలర్ట్..
బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితులను బట్టి.. తాజాగా వాతావరణ శాఖ విశాక తుఫాను హెచ్చరికల కేంద్రం పలు జిల్లాలకు పలు కండిషన్లను జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, బాపట్ల జిల్లాలకు ఈరోజు(సెప్టెంబర్ 12) వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించింది.
ఎల్లో అలర్ట్..
పార్వతీపురం, అల్లూరి, ప్రకాశం, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాలకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగిలిన చోట్ల తేలికపాటి వర్షం పడే అవకాశం.. పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది.
వేటకు వెళ్లొద్దు..
బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సముద్రంలో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఈనెల 15 వరకు ఈ సూచనలు పాటించాలని ప్రకటించింది.