తెలంగాణలో మరో వారం రోజులు వర్షాలు

తెలంగాణలో మరో  వారం రోజులు వర్షాలు
  • పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్​ జారీ చేసిన వాతావరణ శాఖ
  • గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం
  • హైదరాబాద్​ సిటీలో మోస్తరు వర్షాలు పడే చాన్స్​
  • వర్షాల ప్రభావంతో భారీగా తగ్గిన టెంపరేచర్లు.. 40 డిగ్రీలలోపే నమోదు

హైదరాబాద్​, వెలుగు : రాష్ట్రంలో మరో వారం పాటు వర్షాలు పడనున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం విడుదల చేసిన బులెటిన్​లో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్​ జారీ చేసింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్​లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అలాగే ఉందని, కొత్తగా రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల్లోనూ మరో ఆవర్తనం ఏర్పడుతున్నదని తెలిపింది. 

వాటి ప్రభావంతో జయశంకర్​ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్​, వరంగల్​, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నాగర్​కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్​ను ఇష్యూ చేసింది. హైదరాబాద్​ సిటీలోనూ మోస్తరు వర్షాలు పడే అవకాశమున్నట్టు తెలిపింది. రాష్ట్రంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.   

తగ్గిన టెంపరేచర్లు..

రాష్ట్రంలో శుక్రవారం జయశంకర్​ భూపాలపల్లి, ములుగు, నాగర్​కర్నూల్​, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, హనుమకొండ, వనపర్తి, సూర్యాపేట, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్​, జగిత్యాల మంచిర్యాల, ఆసిఫాబాద్​, గద్వాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. నాగర్​కర్నూల్​ జిల్లా పెంట్లవెల్లిలో 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా చేల్పూరులో 5.3, కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా సిర్పూర్​లో 5.1, సిద్దిపేటలో 4.8, జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో 4.6, కరీంనగర్​ జిల్లా వెంకెపల్లిలో 4.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. వర్షాల ఎఫెక్ట్​తో రాష్ట్రంలో టెంపరేచర్లు భారీగా తగ్గాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కిందకు దిగొచ్చాయి. అత్యధికంగా ఆదిలాబాద్​ జిల్లాలో 39.8 డిగ్రీల టెంపరేచర్​ నమోదైంది. నిజామాబాద్​ జిల్లా వాయల్​పూర్​లో 38.8, నిర్మల్​ జిల్లా లింగాపూర్, నాగర్​కర్నూల్​ జిల్లా పెద్దకొత్తపల్లిలో 38.5, మంచిర్యాల జిల్లా కాశీపేటలో 38 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మిగతా జిల్లాల్లో 37 డిగ్రీల కన్నా తక్కువగానే నమోదయ్యాయి. హైదరాబాద్​, రంగారెడ్డి, మేడ్చల్​ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 35 డిగ్రీల మేర టెంపరేచర్లు రికార్డయ్యాయి.