కామారెడ్డి జిల్లాలో పోచారం ప్రాజెక్టు వెలవెల

కామారెడ్డి జిల్లాలో పోచారం ప్రాజెక్టు వెలవెల
  • కెఫాసిటీ  1.82 టీఎంసీలు
  • ప్రస్తుతం 0 .0 640 టీఎంసీలు 
  • వర్షాలు లేక వట్టిపోతున్న బోర్లు
  • ఇంకా జోరందుకోని నాట్లు 

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు వెలవెలబోయింది.  వానలు లేక ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుకుంది.  ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1.82 టీఎంసీలకు శనివారం నాటికి 0.0640 టీఎంసీలకు చేరింది.  మరో వారం, 10 రోజులు ఎగువన ఉన్న  మండలాల్లో  వానలు పడకపోతే పూర్తి స్థాయిలో అడుగంటనుంది.  పోచారం ప్రాజెక్టు ద్వారా నాగిరెడ్డి పేట, ఎల్లారెడ్డి మండలాల్లోని 10,500 ఎకరాలకు అధికారికంగా  సాగు నీళ్లు అందుతుండగా.. అదనంగా మరో 5 వేల ఎకరాల వరకు రైతులు నీటిని పారించుకుంటారు.  ఏటా 2  సీజన్లలో పంటలకు సాగు నీళ్లు అందుతాయి.  ప్రాజెక్టు నీటితో ఆయకట్టు సమీపంలోని పలు మండలాల్లో  భూగర్భజలాలు పెరుగుతాయి.  

ప్రస్తుత పరిస్థితి

 వానాకాలం సీజన్ ప్రారంభమై నెలన్నర రోజులు దాటుతున్నా జిల్లాలో భారీ వర్షాలు ఇప్పటివరకు కురవలేదు.  పలు మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. గాంధారి, లింగంపేట మండలాల్లో భారీ వర్షాలు కురిస్తేనే వాగుల ద్వారా పోచారం ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు  రెండు మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది.

చిన్నపాటి జల్లులు తప్పా భారీ వర్షాలు పడలేదు. దీంతో వాగులు, వంకల్లో  నీటి ప్రవాహం కనిపించడం లేదు.   దీంతో ప్రాజెక్టులోకి వరద నీరు రావడం లేదు. భూగర్భజలాలు కూడా అడుగంటుతున్నాయి.  వరి నాట్లు వేయడానికి  కూడా నీరు అందని పరిస్థితి నెలకొంది.  నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట మండలాల్లోని పలు గ్రామాల్లో  వరి నాట్లు కూడా ఇంకా కంప్లీట్​ కాలేదు.  బోర్లలో కొద్ది పాటి నీటి ధారలకు కొందరు రైతులు వరి నాట్లు వేశారు.  వర్షాలు కురిసిస్తే ప్రాజెక్టులోని నీళ్లు వస్తే  నాట్లు జోరందుకునే అవకాశముంది. 

14  మండలాల్లో లోటు  వర్షపాతం

జిల్లాలో శనివారం నాటికి  14 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. 9 మండలాల్లో సాధారణం​, ఒక మండలంలో  నార్మల్​ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.  నస్రుల్లాబాద్​ మండలంలోనే సగటు  కంటే ఎక్కువ వర్షాలు కురిశాయి.  జిల్లా వ్యాప్తంగా నార్మల్ కంటే - 23.1  లోటు వర్షపాతం నమోదైంది.  ప్రాజెక్టులతో పాటు చెరువులు, కుంటలు, నీళ్లు లేక వెలవెలబోతున్నాయి.  కొద్దిపాటి వర్షానికి సాగు చేసిన మక్క, పత్తి, సోయా, పప్పు దినుసుల పంటలు వాడిపోతున్నాయి.