
రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణశాఖ. చాలా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చంటూ వార్నింగ్ ఇచ్చింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, సిద్ధిపేట, పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, జనగాం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అతి భారీ వర్షాల అలర్ట్ ఇచ్చారు. ఇక మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది వాతావరణశాఖ. నల్గొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో మొస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ అధికారులు తెలిపారు.
గులాబ్ తుఫాన్ ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. జనజీవనం స్తంభించింది. ఈదురుగాలులతో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు అలుగులు పోస్తున్నాయి. మాహబూబాబాద్ మండలం వేమునూర్ శివారు చంద్రుతండాలో పిడుగుపడి రెండు ఎడ్లు చనిపోయాయి. మరో రెండు రోజులు వర్షాలుంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. లోలెవల్ కాజ్ వేల దగ్గర బారికేడ్లు ఏర్పాటుచేసి పోలీసులు పహారా కాస్తున్నారు.