హైదరాబాద్లో వాతావరణ ఒక్కసారిగా మారింది. కూల్ వెదర్ వచ్చేసింది. కొన్ని రోజులుగా మండే ఎండలతో ఇబ్బంది పడిన జనం.. చల్లటి గాలులతో ఎంజాయ్ చేస్తున్నారు. హైదరాబాద్ సిటీలోని ఖుత్బుల్లాపూర్, మియాపూర్, చందానగర్, కూకట్ పల్లి, నిజాంపేట్ వంటి ప్రాంతాల్లో చిరు జల్లులు కురుస్తున్నాయి. సుచిత్ర,జీడిమెట్ల,బహదూర్ పల్లి,పెట్ బషీరాబాద్ పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతోంది. ఎండలతో బెంలేతెత్తిన జనానికి ఇది కొంచెం రిలీఫ్ అని చెప్పవచ్చు.
మరోవైపు రాష్ట్రంలో ఐదు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం, బుధవారం భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది. దాదాపు అన్ని జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ.. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. ఆ తర్వాత మూడు రోజులు కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
నిన్నమొన్నటిదాకా 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైన నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కొద్దిగా దిగొచ్చాయి. ఆయా జిల్లాల్లోని ఒకట్రెండు చోట్ల మాత్రమే 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైతే.. మిగతా చోట్ల 44 లోపే రికార్డ్ అయ్యాయి.