
- కూలిన అరటి చెట్లు, రాలిన మామిడి
- సెంటర్ల దగ్గర తడిసి ముద్దయిన వడ్లు
నెట్వర్క్, వెలుగు: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం కురిసిన అకాల వర్షం వల్ల పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. మామిడి రైతులు మరోసారి తీవ్ర నష్టానికి గురయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వందల ఎకరాల్లో అరటి చెట్లు నేలకొరిగాయి. కోతకు సిద్ధంగా ఉన్న వరి పైరు నేలవాలగా.. కోసి అమ్ముకునేందుకు తీసుకొచ్చిన వడ్లు సెంటర్లలో తడిసి ముద్దయ్యాయి.
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. నర్సింహులపేట పీఏసీఎస్ సెంటర్లో ధాన్యం తడిసి ముద్దయింది. గూడూరు మండలంలో పలుచోట్ల వరి నేలవాలింది. మొక్కజొన్న, ధాన్యం రాశులు తడిసిపోయాయి. ఈదురుగా మూలంగా పలుచోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. బుధవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి జయపురం గ్రామంలో వీరబోయిన అశోక్ రేకుల షెడ్డు కూలిపోయింది. షెడ్డుకు ఉన్న కరెంట్ వైర్లు కిందపడడంతో అక్కడ కట్టేసిన రెండు ఆవులు షాక్కు గురై చనిపోయాయి.
పెద్దపల్లి జిల్లా మంథని, ముత్తారం, రామగిరి, కమాన్ పూర్ మండలాల్లో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి వరి, అరటి తోటలు నేలమట్టం అయ్యాయి. కోత దశకు వచ్చిన పంటలు అకాలవర్షంతో దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఓదెల, శ్రీరాంపూర్, మంథని, ముత్తారం మండలాల్లో నష్టపోయిన పంటలను వ్యవసాయ అధికారులు సరిశీలించారు. 1,381 మంది రైతులకు చెందిన 2,825 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమికంగా అంచనా వేశారు.
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలో మంగళవారం రాత్రి బలమైన గాలులతో భారీ వర్షం కురిసింది. గాలి దుమారానికి ట్రాన్స్ఫార్మర్ దెబ్బతినగా ఏడు చోట్ల కరెంట్ పోల్స్ విరిగాయి. మూడు ఇండ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. దాదాపు 70 ఎకరాల్లో మామిడికాయలు నేల రాలి భారీ నష్టం వాటిల్లింది. కోతకు వచ్చిన వరి పంట నేల వాలింది. మణుగూరులో కల్లాల్లోని ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొత్తగూడెం, ఇల్లెందులోనూ భారీ వర్షం కురిసింది.
ఖమ్మం జిల్లాలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి దాదాపు 3 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. ఒక్కసారిగా ఈదురుగాలులతో వర్షం పడడంతో కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లోని వరి ధాన్యం కూడా తడిసిపోయింది. పలు చోట్ల మిర్చి, మొక్కజొన్న వాన నీటితో తడిసింది. కల్లూరు, తల్లాడ, పెనుబల్లి, వేంసూరు మండలాల్లో మామిడి కాయలు రాలిపోయాయి. జిల్లాలో అత్యధికంగా వైరాలో 34.4 మిల్లీమీటర్లు, కల్లూరులో 28, కొణిజెర్లలో 16.8, కామేపల్లి, తల్లాడలో 15.8, కారేపల్లిలో 13.8, రఘునాథపాలెంలో 11.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం నీర్నెముల తదితర గ్రామాల్లో మంగళవారం రాత్రి కురిసిన వడగండ్ల వానకు సుమారు 250 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్టు వ్యవసాయ ఆఫీసర్లు అంచనా వేశారు.
హనుమకొండ జిల్లాలో మంగళవారం రాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పరకాల, నడికూడ, శాయంపేట మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరి, మిర్చి, మొక్కజొన్న, అరటి, మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పరకాల, శాయంపేట మండలాల్లో ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉండగా.. ఈ రెండు మండలాల్లో 677 ఎకరాల్లో వరి, 107 ఎకరాల్లో మొక్కజొన్న, 60 ఎకరాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసి రైతులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈదురుగాలులతో దెబ్బతిన్న పంటలను బుధవారం అగ్రికల్చర్, హార్టికల్చర్ ఆఫీసర్లు పరిశీలించారు. నష్టం వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు.