వేయి స్తంభాల గుడిలోకి వాన నీళ్లు.. భారీ వర్షాలకు ఉరుస్తున్న పిల్లర్లు

  • వేయి స్తంభాల గుడిలోకి వాన నీళ్లు..  భారీ వర్షాలకు ఉరుస్తున్న పిల్లర్లు
  •  స్తంభాల వెంట కారుతున్న నీళ్లు
  •  గర్భగుడితో పాటు ప్రాంగణంలో లీకేజీలు
  • టెంపరరీ చర్యలు చేపట్టిన ఆలయ అధికారులు

హనుమకొండ, వెలుగు:   భారీ వర్షాల ఎఫెక్ట్​ చారిత్రక వేయిస్తంభాల గుడిపైనా పడింది.  వరుసగా వానలు కురుస్తుండడంతో ఆలయంలోకి వాన నీళ్లు చేరుతున్నాయి. ఆలయ పైభాగంలో నీళ్లు నిలవడంతో పాటు స్తంభాల వెంట గర్భ గుడి లోపలికి చేరుతున్నాయి.  దీంతో పిల్లర్లు, ఆలయ ప్రాంగణం వాన నీటితో తడిసిపోతోంది.  ఫలితంగా అర్చకులతో పాటు గుడిలోని రుద్రేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడ్తున్నారు. క్రీ.శ.1163లో  కాకతీయ రాజు రుద్ర దేవుడి హయాంలో ఈ వేయి స్తంభాల ఆలయాన్ని శాండ్​ బాక్స్​ టెక్నాలజీతో  నిర్మించగా..  డంగు సున్నంతో పాటు ఇనుప పట్టీలతో స్తంభాలను జత చేశారు.  కాగా  ఆలయ కల్యాణ మండపం శిథిలం కావడంతో 2009లో  పునరుద్ధరణ పనులు చేపట్టారు. కానీ బడ్జెట్​తో పాటు వివిధ కారణాల వల్ల  ఆ పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.  ఏండ్లు గడుస్తున్న కొద్దీ స్తంభాల మధ్య జాయింట్లలో లోపాలు తలెత్తడం, ఇనుప పట్టీలు, డంగుసున్నం మధ్య సందులు ఏర్పడడం సమస్యగా మారింది.  దీంతో ఇటీవల కురుస్తున్న వానలతో నీళ్లు కొద్దికొద్దిగా పిల్లర్ల వెంట ఆలయంలోకి చేరుతున్నాయి. ఫలితంగా ఆలయంలో స్తంభాలు పదనుగా మారడంతో పాటు ఆలయం ప్రాంగణంలో ఎప్పుడూ నీళ్లు నిలిచే ఉంటున్నాయి.  

ALSO READ:నాలుగేళ్లుగా న్యాయ పోరాటం.. పోరాడి గెలిచిన జలగం..

శాశ్వత రక్షణ చర్యలు తీసుకోవాలి..

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న వేయి స్తంభాల గుడి ఉరవడం మంచిదికాదని, లీకేజీలను అరికట్టకపోతే ఆలయం ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుందని అర్చకులు, భక్తులు చెప్తున్నారు.  కొద్దిరోజులుగా అధికారులు, సిబ్బంది తాత్కాలిక చర్యలు చేపట్టారు. గర్భగుడికి పైభాగంలో టార్పాలిన్లతో  వాన నీళ్లు గుడిలోపలికి రాకుండాఏర్పాట్లు చేశారు.  కానీ ఆలయం చుట్టూరా ఇదే పరిస్థితి ఉండడంతో తరచూ వర్షపు నీళ్లు ఆలయంలోకి చేరి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చారిత్రక ఆలయానికి ఎలాంటి ప్రమాదం సంభవించకుండా శాశ్వత రక్షణ చర్యలు తీసుకోవాలని అర్చకులు, భక్తులు కోరుతున్నారు.