ఇంకా తొలగని వర్షపు నీరు

ఇంకా తొలగని వర్షపు నీరు

హైదరాబాద్​, వెలుగు: సిటీని నాలుగు రోజులుగా వాన ఇడుస్తలేదు. శనివారం శివరాంపల్లి, అత్తాపూర్ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఉప్పల్, ఎల్ బీనగర్, షేక్ పేట, ఖైరతాబాద్, బాలానగర్ తదితర ప్రాంతాల్లో ఈదరుగాలులతో  ఓ మోస్తరు వాన పడింది. రోడ్లపై వర్షపునీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఖైరతాబాద్, బేగంపేట, ఎల్ బీనగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. వరుసగా కురుస్తున్న వానలకు నాగోల్ పరిధి బండ్లగూడలోని బృందావన్ కాలనీ, శ్రీ సాయిరాం నగర్ కాలనీ, మమతానగర్, వెంకటరమణ కాలనీ, అయ్యప్ప కాలనీ, వనస్థలిపురం వైదేహినగర్ లో ఇంకా రోడ్లపై నీరు ఉంది. డ్రైనేజీ పొంగి రోడ్లపై మురుగు చేరుతోంది. సిటీలో మరో రెండ్రోజులపాటు తేలికపాటి వానలు పడతాయని వాతావరణశాఖ పేర్కొంది. 

అధికారులు పట్టించుకోవట్లే

వర్షాల కారణంగా కాలనీల్లో నీళ్లు నిలిచినా కూడా అధికారులు లైట్ తీసుకుంటున్నారు. కనీసం నీటిని క్లియర్ చేయలేకపోతున్నారు. గ్రేటర్​తో పాటు శివారు మున్సిపాలిటీల్లో నాలాల పనులు జరుగుతున్నాయని మంత్రులు, అధికారులు చెబుతున్నారే తప్ప ప్రస్తుతం అక్కడి జనం ఎదుర్కొంటున్న ఇబ్బందులను పట్టించుకోవడం లేదు. నాలుగైదు రోజులుగా కాలనీల్లో నిలిచిన నీటిని కనీసం మోటార్లు పెట్టి  క్లియర్ చేయడం లేదని జనం మండిపడుతున్నారు. మోకాలి లోతు నీళ్లలోనే రాకపోకలు సాగిస్తున్నా  అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిటీలోని మెయిన్ రోడ్లపై వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద తరచూ సమస్యలు ఏర్పడుతున్నా మాన్ సూన్ టీమ్స్ పట్టించుకోవట్లేందంటున్నారు.