రైతులు వర్షాకాలం పంటల సాగు కోసం సన్నద్ధమవుతున్నారు.ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు పంట సాగుపై అంచనాలు రూపొందించారు. ఈ వానాకాలం సీజన్లో జిల్లాలో సాధారణానికి మించి పంటలు సాగయ్యే అవకాశం ఉందని అధికారులు లెక్కలు వేశారు. వర్షాధార పంటలు సాగు చేసే రైతులకు వ్యవసాయ నిపుణుల సలహాలను గురించి తెలుసుకుందాం.
వర్షాలు పడటంతో రైతులు వర్షాధార పంటలను సాగు చేసేందుకు సిద్దమవుతున్నారు. ఒకే రకమైన పంటలు సాగుచేయడం వల్ల భూసారం దెబ్బతిని దిగుబడి తక్కువగా వస్తున్నది. పంట ఉత్పత్తులు ఎక్కువ కావడం వల్ల మద్దతు ధర లభించడం లేదు. దీంతో మార్కెట్లో మిగతా పంట ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా సాగుచేపడితే మేలని వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. వర్షాధార పంలు సాగుచేయడం వల్ల అధిక లాభాలు గడించొచ్చని చెబుతున్నారు.
వ్యవసాయ నిపుణుల సూచనలు
- రైతులు తేలికపాటి నేలల్లో వాలుకు అడ్డంగా దున్ని పంటలను విత్తుకున్నట్లయితే పంటకు ఎక్కువ కాలం తేమ లభ్య మవుతుంది. వర్షాధారంగా సాగు చేసే పొలాల్లో అంతర పంటలు వేసుకోవాలి.
- ఆరుతడి పంటలను బోదె,సాళ్ళ పద్దతి లేదా ఎత్తు మడుల పద్దతిలో విత్తుకున్నట్లయితే పంటకు ఎక్కువ కాలం తేమ లభ్యమవుతుంది . అదే విధంగా ఎక్కువ వర్షపు నీటిని కాలువల ద్వారా తీసివేయటానికి వీలుంటుంది.
- పొలం గట్లపైన కలుపు మొక్కలు లేకుండా చూడాలి. విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ళను అరికట్టడానికి ప్రధాన పంటలైన వరి, మొక్కజొన్న, జొన్న, పెసర, కంది, వేరుశనగ, విత్తనాలను తెగుళ్ళ మందులతో విత్తన శుద్ధి చేసుకోవాలి.
- వరి సాగు చేసే రైతులు పచ్చిరొట్ట పైరుగా జనుము, జీలుగ, పిల్లి పెసర మొదలగు పచ్చిరొట్ట పైర్లను తప్పనిసరిగా వేసుకొని నాట్లు వేసే ముందు భూమిలో కలియదున్నాలి.
- పత్తి విత్తుటకు ఎర్ర నేలల్లో జూన్ మాసం నుండి జూలై 15, నల్లరేగడి నేలల్లో జులై నుండి ఆగష్టు 15 వరకు అనుకూలం. ఒక ప్రాంతంలోని రైతులంతా దఫాలుగా కాకుండా ఒకేసారి వీలయినంత స్వల్ప వ్యవధిలో విత్తుకోవాలి. పత్తి విత్తన మోతాదు ఎకరాకు 0.75 నుండి 1.0 కిలోలు. పత్తి చుట్టూ .. కంది వేసుకోవడం వలన కాయ తొలిచే పురుగుల ఉధృతి తగ్గుతుంది. నిపుణులసూచనల మేరకు దుక్కిలో ఎరువులు వేసుకోవాలి. విత్తుకున్న 40 రోజులకు తప్పనిసరిగా ఎకరానికి 4-6 లింగాకర్షణ బుట్టలను అమర్చుకోవాలి.
- ప్రస్తుతం పత్తి పంట మొలక దశ నుండి శాకీయ దశలో ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వేరు కుళ్ళు తెగులు ఆశించే అవకాశం ఉంది. భూమిలో తేమ అధికంగా ఉన్నప్పుడు ఈ తెగులు పైరు అన్ని దశల్లో కనిపిస్తుంది. దీని నివారణకు విత్తేతప్పుడు కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడెర్మ పొడితో విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి. ప్రస్తుతం తెగులు లక్షణాలు ఉన్న పొలంలో కాపర్ ఆక్సిక్లోరైడ్ 3.0 గ్రాములు.. ఒక లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని తెగులు సోకిన మొక్కల చుట్టూ వేరు మండలం తడిచేలా పోయాలి.
- ఆముదం విత్తటానికి జూన్ 15 నుండి జూలై 31 అనుకూల సమయం. ప్రస్తుతం నేలలో అందుబాటులో ఉన్న తేమను వినియోగించుకుని దుక్కులు చేసుకోవాలి. కాలానికి, నేలకు, ప్రాంతానికి అనువైన రకాలను వేసుకోవాలి.
- ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు ఆవు, గేదేలలో గాలికుంటూ, ఎంటారోటాక్సీమియా,పారుడు రోగం వ్యాప్తికి అనుకూలం. రైతులు తప్పనిసరిగా టీకాలు వేయించాలి.
- నీటి వసతి గల ప్రాంతాలలో పచ్చిమేత కొరకు పశుగ్రాస పంటలుగా జొన్న, మొక్కజొన్న పంటలను వేసుకోవచ్చు. తక్కువ నీటి వసతి గల ప్రాంతాలలో పశుగ్రాస పంటలుగా సజ్జ,బొబ్బర్ల పంటలను వేసుకోవచ్చు.