వానాకాలం సాగు కోటి 28 లక్షల ఎకరాలు

వానాకాలం సాగు కోటి 28 లక్షల ఎకరాలు

1.18 కోట్ల ఎకరాల్లో పత్తి, వరి, కంది పంటలే

10 లక్షల ఎకరాల్లో మిగతా పంటలు

మరో 8.96 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు
ప్రభుత్వం వద్దన్నా 2.13 లక్షల ఎకరాల్లో మక్కలు
మిల్లెట్స్‌ సాగు 25 శాతమే.. ఆయిల్ సీడ్స్ కూడా తగ్గినయ్‌

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో వానాకాలం సాగు 1.28 కోట్ల ఎకరాలు దాటింది. ఇందులో 1.18 కోట్ల ఎకరాల్లో మూడు రకాల పంటలే వేశారు. ప్రధాన పంటలు పత్తి, వరి, కంది మినహా మిగతా పంటలు అనుకున్నంత మేర సాగులోకి రాలేదు. మిగతా అన్ని పంటలు కలిపి 10 లక్షల ఎకరాల్లోనే సాగయ్యాయి. వీటిలో రాష్ట్ర సర్కార్‌‌ వద్దన్న మక్కలు 2.13 లక్షల ఎకరాలు సాగయ్యాయి.  రైతులు మక్కలు వేయకుంటే ఇతర పంటలన్నీ కలిపి 8 లక్షల ఎకరాలు దాటేవి కాదని తాజా వ్యవసాయ శాఖ లెక్కల ద్వారా స్పష్టమవుతోంది.

సగానికి పడిపోయిన చెరుకు

రాష్ట్రంలో చెరుకు పండించే జిల్లాల్లోనూ ఈ పంటను పక్కన పెట్టేశారు. సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్‌, జగిత్యాల, వనపర్తి, గద్వాల, సూర్యపేట జిల్లాల్లో వానాకాలంలో రైతులు చెరుకు పంట ఎక్కువగానే సాగు చేసేవారు. ఈసారి చెరుకు సాగు లక్ష్యం 67,438 ఎకరాలు కాగా.. 35,904 ఎకరాలే వేశారు.

మిల్లెట్స్‌ సాగు ఢమాల్

చిరుధాన్యాల సాగు తగ్గిపోయింది. సజ్జ, జొన్న, మక్కలు, రాగులు, ఇతర మిల్లెట్స్‌ అన్నీ కలిపి రాష్ట్రంలో 13 లక్షల ఎకరాల్లో జరగాల్సిన సాగును 3.19 లక్షల ఎకరాల్లోనే వేశారు. మొక్కజొన్న వేయొద్దని ప్రభుత్వం ఆదేశించినా 2.13 లక్షల ఎకరాల్లో వేశారు. జొన్నలు లక్ష ఎకరాలు, సజ్జలు 1,513 ఎకరాల్లో మాత్రమే వేశారు. రాగులు 2,244 ఎకరాలు, ఇతర మైనర్‌ మిల్లెట్స్‌ కలిపి మరో 926 ఎకరాలు వేశారు.

ఆయిల్‌ సీడ్స్‌ కూడా అంతంతమాత్రమే..

సర్కారు ఆయిల్‌పామ్‌పై పెట్టిన దృష్టి.. ఆయిల్‌ సీడ్స్‌ పై పెట్టలేదు. దీంతో సాగు భారీగా తగ్గుతోంది. ఆముదపు సాగు 92,994 ఎకరాల్లో జరగాల్సి ఉండగా.. 22,125 ఎకరాల్లో మాత్రమే వేశారు. పొద్దుతిరుగుడు కేవలం 252 ఎకరాలకే పరిమితమైంది. రాష్ట్రంలో 3,694 ఎకరాల్లో సాగు చేసే వాణిజ్య పంట పొగాకు.. కేవలం 460 ఎకరాల్లోనే వేశారు. గతంలో వరంగల్‌ జిల్లాలో పండే వర్జీనియా పొగాకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ ఉండేది.

100 శాతం దాటింది..

ఈ వానాకాలంలో అన్ని జిల్లాల్లో 100 శాతం మించి సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఉద్యాన పంటలు 8.96 లక్షల ఎకరాల్లో సాగు జరిగాయి. దీంతో ఉద్యాన పంటలు, మిగతా పంటలు కలిపి రాష్ట్రంలో 1.37 కోట్ల ఎకరాల్లో సాగు జరిగింది. వ్యవసాయ పంటలు రాష్ట్రంలో 124 శాతం సాగయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 11 లక్షల ఎకరాల్లో.. అత్యల్పంగా మేడ్చల్‌ మల్కాజిగిరిలో 20,860 ఎకరాల్లో సాగయ్యాయి.

For More News..

ఆర్టీసీలో జాబ్ సెక్యూరిటీ ఏది?

చిన్నచిన్న విషయాలకు రూ.12.5 కోట్లు వదిలేయలేం కదా