వర్షాకాలం వచ్చేసింది. చాలాచోట్ల వర్షాలు పడుతున్నాయి.పలు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉంటుంది. కాలువలు... డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తుంటాయి. ఇక హైదరాబాద్ లో అయితే చెప్పే పనే లేదు. ఎక్కడికక్కడ చెత్త, చెదారం పేరుకుపోవడంతో సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఇలాంటి సమయంలో కొన్ని రకాలైన ఆహార పదార్ధాలు తింటే అగ్నికి ఆజ్యం పోసినట్టు.. రోగనిరోధకశక్తి తగ్గి.. వ్యాధులు ఇంకా విజృంభిస్తాయి. వర్షాకాలంలో ఎలాంటి ఫుడ్ తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. . ..
వర్షం వచ్చిందంటే చాలు.. ఈగలు.. దోమలు విజృంభిస్తాయి. ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నాయో కాని దోమల హవా పెరుగుతుంది. దీంతో జలుబు, ఫ్లూ, టైఫాయిడ్, మలేరియా డెంగ్యూ, వైరల్ ఫీవర్ వంటి సమస్యలు వస్తాయి. కొన్ని రకాల వ్యాధులు దోమల ద్వారా వస్తే మరికొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల వస్తాయి. ఇలాంటి సమయంలో మనం తినే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోకపోతే రోగ నిరోధకశక్తి తగ్గుతుంది. సహజంగా వర్షాకాలం సీజన్‌లో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు వంటి వ్యాధికారకాలు వృద్ధి చెందుతాయి. ఈ కాలంలో కొన్ని ఆహారాలు అనారోగ్యానికి గురి చేస్తాయి. వాటికి వీలైనంత దూరంగా ఉండటం మంచిది.
ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, వర్షాకాలంలో వాటిని తినడం తగ్గించాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో ఆకుకూరలు పండించే ప్రదేశాలు అపరిశుభ్రంగా మారుతాయి. చిత్తడి నేలల్లో వీటిని పండిస్తారు. రవాణా సమయంలో సరైన శ్రద్ధ తీసుకోరు.. ఆకుకూరలకు బురద అంటుకుంటుంది. అప్పుడు బ్యాక్టీరియా చేరి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో బ్రకోలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి వెజిటేబెల్స్‌పై పురుగులు ఉండే అవకాశం ఎక్కువ. వర్షాకాలంలో ఎక్కువ తేమ ఉండటం వల్ల ఆకుకూరలు త్వరగా పాడైపోతాయి. తడి వాతావరణంలో క్యాబేజీ వంటి ఆకుకూరల్లో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఎక్కువ. వర్షాకాలపు తేమ వాతావరణంలో పాలు, పెరుగు, పనీర్ వంటి పాల ఉత్పత్తులలో బ్యాక్టీరియా ఎక్కువగా పెరుగుతుంది. మామూలుగా వర్షాకాలంలో పాల ఉత్పత్తులు చాలా త్వరగా చెడిపోతాయి. అందుకే వీటిని తినడం తగ్గించాలి.
ఇక వర్షం పడిందంటే చాలు స్ట్రీట్ ఫుడ్స్‌కు ప్రాధాన్యత ఇస్తారు. ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. ఎంత రుచి ఉంటాయో.. తింటే అంతకన్నా ఎక్కువ రోగాలు వస్తాయి. ఈగలు, దోమలు, ఇతర బ్యాక్టీరియా ఆ పదార్దాలపై చేరుతాయి. వ్యాపారులు వాటిని ప్రతి సారి శుబ్రంగా కడగలేరు. వర్షాకాలంలో నీరు కూడా కలుషితమవుతుంది.ఆ నీటినే ఫుడ్స్ తయారీలో వాడవచ్చు. ఇలా తయారుచేసిన ఆహారాలు తింటే డైజెస్టివ్ ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి ప్రమాదాలు పెరుగుతాయి. కాబట్టి బయటి ఫుడ్ కు దూరంగా ఉండండి.
. వర్షాకాలంలో పచ్చి కూరగాయలు (Raw vegetables) తినడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎందుకంటే ఈ సీజన్‌లో పచ్చి కూరగాయలపై బ్యాక్టీరియా ఉండే అవకాశం ఎక్కువ. వర్షాకాలంలో వాతావరణం బ్యాక్టీరియా, శిలీంధ్రాల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. పచ్చి కూరగాయలతో వ్యాపించే క్రిముల కారణంగా డయేరియా, వాంతులు, జ్వరం వంటి అనారోగ్యాలు రావచ్చు. అందుకే కూరగాయలను బాగా ఉడికించి, వేయించి లేదా ఆవిరిపై ఉడికించి తినాలి. చేతులు కడుక్కోకుండా, అపరిశుభ్ర పద్ధతుల్లో చేసే ఆహారాలు జోలికి వెళ్లకూడదు
వర్షాకాలంలో చేపలు, రొయ్యలు, పీతలు వంటి సీ ఫుడ్, రెడ్ మీట్ కలుషితం కావడానికి అవకాశం ఎక్కువ. ఈ సమయంలో ఇవి తాజాగా దొరకడం కష్టం. సరిగ్గా నిల్వ చేయని, పచ్చిగా తినే మాంసం, సీ ఫుడ్ వల్ల అనారోగ్యాలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి కొన్ని నెలల పాటు వీటిని తినకూడదు. వర్షాకాలంలో పండ్లు కోసిన వెంటనే తినాలి. కట్ చేసి, తోలు తీసివేసిన చాలాసేపటి వరకు వీటిని పక్కన పెడితే అనారోగ్యాల ముప్పు పెరుగుతుంది. వీటిపై బ్యాక్టీరియా, శిలీంధ్రాలు సులభంగా చేరుతాయి, అవి త్వరగా చెడిపోతాయి. వీటిని తినడం వల్ల డయేరియా, వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు. అందుకే వాటికి దూరంగా ఉండటం మంచింది.