భయపెడుతున్న కండ్లకలక... లక్షణాలు ఇవే

భయపెడుతున్న కండ్లకలక...  లక్షణాలు ఇవే

వర్షాలు పడుతున్నాయి.  వర్షాకాలం వచ్చిందంటే ఆస్పత్రులు కిక్కరిసి పోతుంటాయి.  పలు ఆరోగ్య సమస్యలు జనాలను ఉక్కిరి బిక్కిరి చేస్తాయి.  ప్రదానంగా వైరల్ ఫీవర్, జలుబు, దగ్గు తలనొప్పితో పాటు మరో వ్యాధి కూడా  విజృంభిస్తుంది.  చూసే కళ్లకు ఇన్ ఫెక్షన్ సోకుతుంది.  దీనినే కండ్ల కలక అంటారు.  ఇది ప్రమాదకరమైన జబ్బుకాకపోయిన కండ్లు ఎర్రబడి.. మంటగా ఉంటాయి.  వర్షాకాలంలో గులాబీ కండ్లకల  (ఫోలిక్యులర్‌ కండ్ల కలక) కేసులు అధికం అవుతున్నాయి.  చూపులో స్పష్టత లోపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  అయితే  దగ్గు, జలుబు, తుమ్ములు వంటి వాటికి సొంత చిట్కాలు పని  చేసినా.. కండ్ల కలక వస్తే చిట్కా వైద్యంతో సమస్యలు తెచ్చుకోవద్దని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  ఈ పరిస్థితుల్లో నేత్ర పరిశుభ్రత పట్ల అప్రమత్తత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

మనిషి శరీరంలో కీలకమైన భాగం కన్ను.  వానాకాలంలో నేత్ర సంబంధిత వ్యాధులు వస్తుంటాయి.  ముఖ్యంగా కండ్లకలక జనాలను ఇబ్బందిపెడుతుంది. సాధారణంగా వర్షకాలంలో తేమ శాతం అధికంగా ఉంటుంది. వాతావరణంలోని తేమ వైరస్‌లకు ఆవాసంగా మారుతుంది. దీంతో రకరకాల సూక్ష్మక్రిములు వర్షకాలంలో వృద్ధి చెందుతాయి. ఈ వైరస్‌లలో ఒకటైన ఎడినోవైరస్‌ కండ్లపై ప్రభావం చూపుతుంది. కంట్లో తెల్లభాగాన్ని, కనురెప్పల లోపలివైపు భాగాన్ని కప్పి ఉంచే పల్చటి శ్లేష్మపొర అయిన కంజెక్టివాకు వచ్చే వాపునే సాధారణ పరిభాషలో ‘కండ్ల కలక’ అంటారు. ఇది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, వివిధ రకాల అలర్జీల వల్ల వస్తుంది.

 లక్షణాలు

  • కండ్ల కింద వాపు
  • కంట్లో ఎరుపు లేదా గులాబీ వర్ణం
  • దురద
  • కంటి నుంచి ధారాపాతంగా నీరు
  • నేరుగా కాంతిని చూడలేకపోవడం
  • జ్వరం
  • గొంతునొప్పి


కండ్ల కలక సోకినవారు ఇతర కుటుంబ సభ్యులకు, బయటి వ్యక్తులకు దూరంగా ఉండాలి. తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. కండ్లను చేతితో తాకరాదు. వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోవద్దు. కండ్లజోడు వాడాలి. మంట నుంచి ఉపశమనానికి వైద్యుల సలహాతో అనెల్జెసిక్స్‌ వాడవచ్చు, చుక్కల మందులు వాడొచ్చు. కండ్లజోడు పెట్టుకోవాలి, మెత్తని, చెమ్మగా ఉన్న టవల్‌తో కంటి స్రావాన్ని శుభ్రపర్చాలి. ఇష్టానుసారం యాంటీబయోటిక్స్‌, స్టెరాయిడ్స్‌ వాడకూడదు. చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి.