తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. నారు మడులు ఆరడం లేదు. వానలకు పొలాల్లో కలుపు మొక్కలు విపరీతంగా పెరుగుతున్నాయి. కూరగాయల సాగు చేలల్లో మొక్కులు నీళ్లలో మునిగి ఉన్నాయి. ఈ పరిస్థితిలో కూరగాయలు సాగు చేసే రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే దిగుబడి తగ్గుతుంది. వ్యవసాయశాఖ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం కూరగాయల రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుసుకుందాం.. .
వర్షాలకు దెబ్బతిన్నకూరగాయ పంటల్లో మొక్కల వేర్లు, నీటిలో మునిగిన ఆకులు,మొక్క భాగాలు కుళ్లిపోతాయి.పోషకాల లభ్యత తగ్గిపోతుంది.సేద్యపు పనులలో ఆలస్యం జరుగుతుంది.కలుపు బెడద పెరుగుతుంది.ఆహారం తయారుచేసుకునే శక్తి తగ్గుతుంది.చీడపీడల బెడద పెరుగుతుంది.పంట ఎదుగుదలకు, కాపు రావడానికి అవసరమైన హార్మోన్లపై నీటిముంపు ప్రభావం వల్ల దిగుబడులు తగ్గుతాయి.
- ప్రత్యేకించి టమాటాలో మొక్క ఎదుగుదల తగ్గుతుంది. పూత రాలడం, ఎండు తెగులు, ఆకుమచ్చ తెగులు ఉధృతి పెరుగుతోంది.
వంగలో ఆకులు పసుపు బారడం,రాలిపోవడం , అక్షింతల పురుగులు, బ్యాక్టీరియా మచ్చ తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. - మిరపలో నారు కుళ్ళు,ఎండు తెగులు, కానోఫోరా తెగులు, ఆకుమచ్చ తెగులు అధికంగా వస్తాయి.
- తీగ జాతి కూరగాయల్లో ఆకులు పసుపు బారడం, బూజు తెగులు ఎక్కువగా వస్తాయి.
- ఆకుకూరల్లో కుళ్ళిపోవడం,ఆకు తినే పురుగు, ఆకుమచ్చ తెగులు ఉధృతి పెరుగుతుంది.
- దుంప కూరగాయల్లో అధిక శాఖీయ ఉత్పత్తి, దుంప కుళ్ళు సమస్యలుంటాయి..
యాజమాన్య పద్ధతులు
అధిక వర్షాలలో కూరగాయ పంటల పొలాల్లో అధికంగా ఉన్న నీటిని వెంటనే తీసి బయటకు పంపే ఏర్పాటు చేయాలి. పడిపోయిన మొక్కలను జాగ్రత్తగా నిలబెట్టి మొక్క మొదలు చుట్టూ మట్టిని వేయాలి. వర్షాకాలంలో తప్పనిసరిగా బోదెలపై లేదా బెడ్లపై నాటుకోవాలి.
- వర్షాలు ఆగిన వెంటనే 19 :19 :19 లేదా 13 :0 :45 లేదా యూరియా లేదా మెగ్నీషియం సల్ఫేట్ వంటి పోషకాలను పంటపై లీటరు నీటికి ఐదు గ్రాముల చొప్పున కలిపి పిచికారి చేయాలి. అవసరాన్ని బట్టి సూక్ష్మ పోషకాలను కూడా పిచికారీ చేయాలి.
- వర్షాలు తగ్గి ... నేల ఆరిన తర్వాత రసాయనిక ఎరువులను బూస్టర్ డోసుగా వేసుకోవాలి. అంతర సేద్యం చేయడం ద్వారా నేల పొరలలో తేమ ఆరేలా చేయాలి.
- అధిక వర్షాలకు విత్తిన విత్తనం మొలకెత్తేటప్పుడు లేదా లేత మొక్కలు దెబ్బతిన్నప్పుడు నర్సరీలోపెంచుకున్న నారును తెచ్చుకుని సకాలంలో పూర్తి చేసుకోవడం ద్వారా పంట దిగుబడులు తగ్గకుండా చేసుకోవచ్చు.
- పందిరి జాతి కూరగాయలను సాగు చేస్తున్నప్పుడు వర్షాకాలంలో తగిన విధంగా మొక్కలకు ఊతం ఇవ్వాలి.పందిర్లపై సాగు చేయడం ద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చు.
- టమోటా వంటి పంటల్లో 1.5 గ్రా.చొప్పున బోరాన్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయడం ద్వారా కాపు వచ్చిన టమోటా పంటలో బోరాన్ లోపం నివారించుకోవచ్చు.
- మిరపలో అధిక వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలబడి మిరప పంట ముంపునకు గురైనట్లయితే నష్టం వాటిల్లుతుంది. అధిక తేమ వల్ల వేర్ల ద్వారా మొక్కలకు అవసరమైన పోషకాలు అందవు.దీని ద్వారా పంట ఎదుగుదల లోపించడమే కాకుండా పంట.. పురుగులు తెగుళ్ళ బారిన పడడం, సూక్ష్మ ధాతు లోపాలు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది.
- పంట దశను,ముంపు ఉధృతిని బట్టి తగిన జాగ్రత్తలు పాటించి,ఎరువులను సూక్ష్మ పోషకాలను వాడి నష్టాన్ని కొంతవరకు తగ్గించుకునే అవకాశం ఉంది.
- నీటి ముంపునకు గురై తలలు వాలినట్లయితే వెంటనే తేరుకోవడానికి లీటర్ నీటికి 10 గ్రాముల యూరియా కలిపిన ద్రావణాన్ని వారంలో రెండుసార్లు పిచికారి చేయాలి. వడలిన మొక్కలకు లీటర్ నీటికి 5 గ్రా. మెగ్నీషియం సల్ఫేట్ కలిపిన ద్రావణంతో పిచికారీ చేయాలి
- ఇనుప ధాతు లోపంతో మొక్కలు పాలిపోయినట్లు కనబడితే 100 లీటర్ల నీటికి 50 గ్రా. అన్నబెధితో పాటు ఒక నిమ్మచెక్క రసం కలిపి పిచికారి చేయాలి.
- పై పాటుగా అదనంగా ఎకరానికి 50 కిలోల యూరియా, 25 కిలోల పొటాష్, 200 కిలోల వేప పిండి వేసుకోవాలి.
- నేల అదునులోకి రాగానే గొర్రుతో అంతర కృషి చేయాలి.తర్వాత స్థూల పోషకాలు మిశ్రమాన్ని 5 గ్రాములు లీటరు నీటికి మరియు సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని 2.5 గ్రాముల లీటరు నీటికి ఒక దాని తర్వాత ఒకటి రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు సార్లు పిచికారి చేయాలి.
- వర్షాలు ఎక్కువుగా పడినప్పుడు బ్యాక్టీరియా ఆకు మచ్చ, కొయినోఫోరా తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్తగా పది లీటర్ల నీటికి 30 గ్రా. కాపర్ ఆక్సి క్లోరైడ్ మరియు ఒక గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ కలిపిన ద్రావణాన్ని పిచికారి చేసి వీటి వ్యాప్తిని అరికట్టాలి.
- లేత తోటలు పూర్తిగా ముంపునకు గురైతే పంటను తీసివేసి ప్రత్యామ్నాయంగా వేరొక పంటను సాగు చేసుకోవాలి.