ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిజామాబాద్, వెలుగు: సిజేరియన్లను నియంత్రిస్తూ, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించే దిశగా  ప్రజల్లో అవగాహన  పెంచేందుకు కృషి చేయాలని  కలెక్టర్  నారాయణరెడ్డి  సూచించారు.  సిజేరియన్ కాన్పుల  వల్ల కలిగే నష్టాలను గురించి ప్రజలకు  వివరించాలని చెప్పారు. కలెక్టరేట్​లో గురువారం  మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  నిజామాబాద్ జిల్లాలో  సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయని,  వీటిని నియంత్రించేందుకు  కృషి చేస్తున్నామని వివరించారు. ముఖ్యంగా గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు నార్మల్ డెలివరీలకే ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ కోరారు. నార్మల్​ డెలివరీలో పుట్టిన శిశువుకు గంటలోపే ముర్రుపాలు అందించే వీలుందని తెలిపారు.  సిజేరియన్లు చేస్తున్న ఆసుపత్రులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలతో  తనిఖీలు చేస్తున్నామని చెపపారు. దీంతోపాటు వసతులు లేని రెండు ఆసుపత్రులను గుర్తించి సీజ్ చేశామని, శాశ్వత గైనకాలజిస్టులను ఏర్పాటు చేసుకోకుండానే ప్రసవాలు చేస్తున్న మరో 18 ఆసుపత్రులకు నోటీసులు  అందించామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తూ అవసరం లేకపోయినా సిజేరియన్లు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. 

ప్రభుత్వ ప్లాట్ల విక్రయానికి వేలం

 నిజామాబాద్ నగర శివారులోని మల్లారం వద్ద గల ప్రభుత్వ భూమిలో 80 ప్లాట్ లను విక్రయించేందుకు వచ్చే నెల నవంబర్ 14 న వేలం నిర్వహించనున్నట్టు  కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు.  ఆసక్తి గల వారు బిడ్డింగ్ లో పాల్గొనాలని సూచించారు.

పోడు పట్టాలు ఇవ్వాలని గ్రామస్థుల డిమాండ్​ 

అధికారులకు, గ్రామస్థులకు మధ్య వాగ్వాదం

లింగంపేట,వెలుగు: గిరిజనులకు ఇచ్చినట్టు తమకూ  పోడు పట్టాలు ఇవ్వాలని కోరుతూ  మండలంలోని ఒంటర్​పల్లి లో  ఎస్సీలు డిమాండ్​ చేశారు.  గ్రామ శివారులోని   ఫారెస్టు భూమిని రైతులు స్వాధీనం చేసుకొనేందుకు ప్రయత్నించారు.  విషయం తెలుసుకున్న  ఫారెస్టు సెక్షన్​ ఆఫీసర్​ భీమ్​రెడ్డి, బీట్​ ఆఫీసర్​ శంకరప్ప  అక్కడకు చేరుకొని వారితో మాట్లాడారు.  గ్రామస్థులు గొడవకు దిగడంతో  ఎల్లారెడ్డి రేంజ్​ ఆఫీసర్​ ఓంకార్​,  సీఐ  శ్రీనివాస్​, లింగంపేట ఎస్​ఐ శంకర్​,   తహసీల్దార్​ మారుతి  వచ్చి స్థానికులతో చర్చించారు.  ప్రభుత్వ భూములను సాగులో ఉన్న గిరిజనులకే పోడు పట్టాలు ఇస్తామని ఫారెస్టు ఆఫీసర్లు చెప్పడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.  సమస్యను జిల్లా కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్తామని అధికారులు చెప్పడంతో   గ్రామస్థులు  శాంతించారు.

8 మిల్లుల్లో పత్తి కొనుగోలు

కామారెడ్డి , వెలుగు :  జిల్లాలో  పత్తి కొనుగోలుకు 8 మిల్లుల్లో ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్​ జితేష్​  వి పాటిల్​ తెలిపారు. పత్తి కొనుగోళ్లపై గురువారం  కలెక్టరేట్​లో ఆఫీసర్లు, జిన్నింగ్​ మిల్లుల ఓనర్లతో మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా   కలెక్టర్​ మాట్లాడుతూ.... నాణ్యత ప్రమాణాలు పాటించి రైతులు మద్దతు ధర పొందాలన్నారు.  రైతులకు ఇబ్బందులు కలిగించకుండా కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు.  ఆయా పంటలకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు రేట్ల వివరాల పోస్టర్లను కలెక్టర్​  రిలీజ్​ చేశారు. అడిషనల్​  ఎస్పీ అన్యోన్య, జిల్లా అగ్రికల్చర్​ ఆఫీసర్​ భాగ్యలక్ష్మీ,   జిల్లా ట్రాన్స్​ఫోర్ట్ ఆఫీసర్​ వాణి, ,  మార్కెటింగ్​ ఆఫీసర్​ రమ్య తదితరులు పాల్గొన్నారు. 

పోడు భూముల సర్వే పకడ్బందీగా జరగాలె

బీర్కూర్​, వెలుగు: పోడు భూముల సర్వే పకడ్బందీగా చేయాలని  బీర్కూర్​ ఎంపీపీ రఘు అన్నారు.  స్థానిక మండల పరిషత్ ​కార్యాలయంలో ఎంపీపీ  అధ్యక్షతన గురువారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలను  వినిపించారు. బీర్కూర్​ మండలం  నుంచి బాన్సువాడ  దారిలో స్పీడ్​ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని సభ్యులు కోరారు.  గ్రామాల్లో వంగిన స్థంభాలను సరిచేయాలని,   పోడు భూముల సర్వే   నివేదికలను ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీలకు అధికారులు అందించాలని  కోరారు.   బాన్సువాడ డిపో నుంచి ఆర్టీసీ బస్సులు సక్రమంగా నడిచేలా చూడాలని సభ్యులు విన్నవించారు.  ఈ సమావేశంలో ఎంపీడీవో భాను ప్రకాష్​, తహసీల్దార్​ రాజు, మార్కెట్​ కమిటీ ఛైర్మన్​ ద్రోణవల్లి అశోక్​, జడ్పీటీసీ స్వరూ ప, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ లు పాల్గొన్నారు.

టీఆర్​ఎస్​ నాయకుల అక్రమాలు అరికట్టాలె

ధర్పల్లి, వెలుగు:  కొత్త సొసైటీ పాలకవర్గం ఆధ్వర్యంలో  అక్రమాలకు  అండగా ఎమ్మెల్యే పాలన కొనసాగుతుందని బీజేపీ రూరల్​ ఇన్​చార్జి దినేశ్​ కుమార్​ ఆరోపించారు.  ధర్పల్లి గాంధీ విగ్రహం వద్ద బీజేవైఎం ఆధ్వర్యంలో   సమస్యల పరిష్కారం కోసం గురువారం నిరసన  కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా దినేశ్​ మాట్లాడుతూ..   ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్​ అక్రమార్కులకు అండగా ఉంటున్నాడని,  గత సొసైటీ పాలకవర్గంలో మాజీ చైర్మన్​  ఆధ్వర్యంలో సుమారు కోటి రూపాయలకు పైగా అక్రమాలు జరిగినా  ఆయనపై చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహించారు.  కోట్ల రూపాయలు కుంభకోణం చేసిన చైర్మన్​ టీఆర్ఎస్​ నాయకుడు కావడంతో  తప్పించుకు తిరుగుతున్నాడని దినేశ్​ ఆరోపించాడు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు లోలం గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి మహిపాల్ యాదవ్​, కర్కపెద్ద బాల్​రెడ్డి, గంగదాసు, లావుడ్యశ్రీనివాస్​, చెలిమెల నవీన్​, దుబ్బాక నరేశ్​  పాల్గొన్నారు.  

మార్కెట్​ స్థలాన్ని కాపాడాలని రిలే నిరాహార దీక్ష 

నవీపేట్, వెలుగు:  స్థానిక మార్కెట్​ స్థలాన్ని  కాపాడాలని హిందూ జాగరణ సమితీ  రిలే దీక్ష  గురువారం రెండో రోజూ కొనసాగింది.   మార్కెట్ స్థలాన్ని కబ్జా చేసుకుంటున్న వారికి  ఆఫీసర్లు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.  కబ్జా కాకుండా ఆపాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో  ఎంపీటీసీ రాధ, సమితి సభ్యులు రాము, గణేశ్​, బాలగంగాధర్ పాల్గొన్నారు. 

ఎంఎల్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌ ఇన్​చార్జిపై చర్యలు తీసుకోవాలి

వర్ని,వెలుగు: బియ్యం తక్కువ వచ్చిందని వర్ని ఎంఎల్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌ కు వెళ్ళిన కోటగిరి మండలానికి చెందిన డీలర్ సాయన్నపై దురుసుగా వ్యవహారించిన ఎంఎల్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌ ఇన్​చార్జి అజయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌పై చర్యలు తీసుకోవాలని రేషన్‌‌‌‌‌‌‌‌ డీలర్లసంఘం సభ్యులు కోరారు.  గురువారం జిల్లా రేషన్‌‌‌‌‌‌‌‌ డీలర్ల సంఘం జిల్లా ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ నగేశ్​ ఆధ్వర్యంలో అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ కు ఫిర్యాదు చేశారు.   ఎంఎల్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌ ఇంచార్జి  అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారని, దురుసుగా ప్రవర్తించాడని తెలిపారు.  ఆయనపై చర్యలు తీసుకోవాలని వారు విన్నవించారు.   ఏఓకు వినతిపత్రం అందించినట్లు  సంఘం జిల్లా ప్రసిడెంట్‌‌‌‌‌‌‌‌ నగేశ్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో రేషన్‌‌‌‌‌‌‌‌ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షులు అతిమల నాగేశ్​, జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టి పార్థసారథి, గౌరవ అధ్యక్షులు గంగా కిషన్   తదితరులు పాల్గొన్నారు

దొంగ అరెస్టు

కామారెడ్డి , వెలుగు :   నాగిరెడ్డిపేట మండలం బొల్లారంలో  బుధవారం రాత్రి ఓ ఇంట్లో చోరీ జరగగా ,  కొన్ని గంటల్లోనే  పోలీసులు దొంగను పట్టుకున్నారు.  ఎల్లారెడ్డి డీఎస్పీ గురువారం తెలిపిన వివరాల ప్రకారం..  బొల్లారంలో  మంగళి  సుజాత తన పాత ఇంటికి తాళం వేసి కొత్త ఇంటి దగ్గరకు వెళ్లి అక్కడే నిద్రపోయింది.  గురువారం ఉదయం పాత ఇంటికి వెళ్లే సరికి వస్తువులు  చిందర వందర ఉన్నాయి.  దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.   ఘటన స్థలాన్ని నాగిరెడ్డిపేట పోలీసులు పరిశీలించారు.  ఇంటి వెనుక వైపు దొంగ వదిలివెళ్లిన చెప్పుల ఆధారంగా   అదే గ్రామానికి చెందిన పాత నేరస్థుడు  మంగళి గౌరి శంకర్​ను   ఎంక్వైరీ చేయగా నేరాన్ని ఒప్పుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఇతని నుంచి  2.3 తులాల బంగారం వస్తువులు 40 గ్రాముల వెండి వస్తువులు,  రూ.30వేల నగదు  స్వాధీనం చేసుకుని నిందితున్ని అరెస్టు చేశామన్నారు.   

టెన్త్​ టాపర్​కు ఆర్థికసాయం

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్​ మండ​లం మంథని జడ్పీ హైస్కూల్​లో గురువారం జరిగిన ప్రోగ్రాంలో టెన్త్​ టాపర్ జయశ్రీ ని సన్మానించారు. ముస్కు  గణేశ్​ రూ.5వేలు, లాలన వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు పైపుల రాజరెడ్డి రూ.5వేలు జయశ్రీకి ఆర్థిక సాయంగా అందించారు.  అనంతరం  డాక్టర్ నరేశ్​ కుమార్​   ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి,  మందులు పంపిణీ చేశారు. ఉచిత వైద్య సేవలు అందించిన డాక్టర్ నరేశ్ కుమార్ ను సర్పంచ్ లింబారెడ్డి  సన్మానించారు. కార్యక్రమంలో హెచ్​ఎం శ్యామల, గ్రామస్థులు  తదితరులు  పాల్గొన్నారు. 

విధుల్లో చేరిన వీఆర్ఏలు

లింగంపేట, వెలుగు: లింగంపేట మండలంలోని 102 మంది వీఆర్​ఏలు గురువారం విధుల్లో చేరారు.  ఈ సందర్భంగా  తహసీల్దార్​మారుతికి లెటర్​అచ్చారు.  పేస్కేల్​ అమలు చేయాలని 80 రోజులుగా సమ్మె చేసిన వీఆర్​ఏల  సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం  హామీ  ఇవ్వడంతో విధుల్లో చేరుతున్నట్టు  మండల వీఆర్​ఏల సంఘం అధ్యక్షుడు రవికుమార్, గౌరవ అధ్యక్షుడు  సాయిలు, మల్గుల ఎల్లయ్య, ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ తెలిపారు.