వీఆర్ఏలకు వేతనాల్లేవ్.. కొత్త సర్కారైనా స్పందించాలని వేడుకోలు

  • రెగ్యులర్ చేసి వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన గత సర్కారు
  •     ఎంప్లాయీస్ కు ఐడీ నంబర్ రాక
  •     ఐదు నెలలుగా వేతనాలు బంద్
  •     రెవెన్యూ శాఖలో కొనసాగుతున్న వీఆర్ఏలదీ అదే దుస్థితి

కరీంనగర్, వెలుగు : వీఆర్ఏలను వివిధ శాఖల్లో సర్దుబాటు చేసి ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు వారికి ‌జీతాలు పడలేదు. ‌జాబ్ రెగ్యులరైజ్ అయిందని, పే స్కేల్ వస్తుందని సంతోషించిన వారికి నిరాశే మిగిలింది. కొత్తగా జాయిన్ అయిన శాఖల్లో ఎంప్లాయ్ ఐడీ రాక సాలరీ లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే హడావుడిగా రెగ్యులరైజేషన్ ప్రాసెస్ ను ప్రారంభించారని, కానీ, ఆ ప్రక్రియను పూర్తి చేయడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించిందని మాజీ వీఆర్ఏలు మండిపడుతున్నారు. కొత్త సర్కారైనా తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

20,555 మంది ఎదురు చూపులు..

రాష్ట్రవ్యాప్తంగా సుమారు‌20,555 వేల మంది వీఆర్‌ఏలు ఉండగా వారిలో తొలి విడతలో విద్యార్హతలను బట్టి 14,954 మందిని వివిధ శాఖల్లో ఈ ఏడాది ఆగస్టు 10న సర్దుబాటు చేసిన విషయం తెలిసిందే. వీరిలో అత్యధికంగా నీటిపారుదల శాఖలో 5 వేల మందిని లష్కర్లుగా, మిషన్‌ భగీరథలో జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ హోదాలో‌3,372 మందిని, రెవెన్యూ శాఖలోనే జూనియర్‌ అసిస్టెంట్లుగా 2,451 మందిని, మున్సిపాలిటీల్లో జూనియర్‌ అసిస్టెంట్లుగా, వార్డ్‌ ఆఫీసర్లుగా 1,266 మందిని, రెవెన్యూ శాఖలో రికార్డు అసిస్టెంట్లుగా 2,113 మందిని, ఆఫీసు సబార్డినేట్లుగా 680 మందిని సర్దుబాటు చేశారు. మరికొన్ని డిపార్ట్​మెంట్లలో మరో 72 మందిని సర్దుబాటు చేశారు. ‌వీరంతా ప్రస్తుతం తమకు కేటాయించిన శాఖల్లో డ్యూటీ చేస్తున్నారు. సర్దుబాటు అయిన వారితోపాటు రెవెన్యూ శాఖలో కొనసాగుతున్న వీఆర్ఏలకు కూడా జీతాలివ్వకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఐదు నెలలైనా ఎంప్లాయ్ ఐడీ రాలే..‌

ప్రభుత్వ రంగంలోగానీ ప్రైవేట్ సెక్టార్ లోగానీ ఏ ఎంప్లాయ్ కి అయినా ఎంప్లాయ్‌ ఐడీ ప్రధానం.‌ఎంప్లాయ్ ఐడీ వస్తేనే సాలరీ బిల్లు చేస్తారు. కానీ, వీఆర్‌ఏలను వేర్వేరు ‌శాఖల్లో సర్దుబాటు చేసిన గత ప్రభుత్వం..వారికి ఎంప్లాయ్ ఐడీ ఇవ్వలేదు. దీంతో 14,954‌ మందికి ఇబ్బందులు తప్పడం లేదు.‌

సమ్మె కాలపు జీతమూ రాలే..

తమ సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని, గతంలో‌ ఇచ్చిన హామీ మేరకు పే స్కేల్ వర్తింపజేయాలని వీఆర్ఏలు నిరుడు 83 రోజులపాటు సమ్మె చేశారు. మునుగోడు బై ఎలక్షన్ రావడంతో అప్పటి సర్కార్ దిగొచ్చి చర్చలు జరిపి సమ్మె విరమింపజేసింది.‌ ఆ తర్వాత జులైలో రెగ్యులరైజేషన్ పై నిర్ణయం తీసుకున్న సందర్భంలో సమ్మె కాలపు వేతనాన్ని మూడు విడతల్లో చెల్లిస్తామని అప్పటి సీఎం కేసీఆర్ వీఆర్ఏ జేఏసీ నాయకులకు ‌హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటి వరకు ఆ వేతనం కూడా మంజూరు కాలేదు.

జీతాలిచ్చి ఆదుకోవాలి

బీఆర్ఎస్ ప్రభుత్వం ‌మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి మధ్యలోనే వదిలేసింది.‌ఇప్పటి వరకు ఎంప్లాయ్ ఐడీ ఇవ్వకపోవడం దారుణం. జీతాల్లేక‌ వీఆర్ఏలు అల్లాడిపోతున్నారు. కొత్త ప్రభుత్వమైనా మా గోసను పట్టించుకోవాలి. జీతాలిచ్చి ఆదుకోవాలి. ఇప్పటికే రెవెన్యూ శాఖలో అన్ని డిపార్ట్​మెంటల్​టెస్టులు పాసైన మమ్మల్ని ‌ఇతర శాఖల్లోకి పంపి అన్యాయం చేశారు. తిరిగి రెవెన్యూ శాఖలోకి జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్ క్యాడర్ లో తీసుకురావాలి.
– రమేశ్ బహదూర్, వీఆర్ఏ జేఏసీ