విశ్లేషణ : ఆడపిల్లల పెండ్లి వయసు 21 ఏండ్లకు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనదే అయినప్పటికీ ఆ ఒక్క నిర్ణయంతోనే ఆడమగా సమానత్వం సాధ్యమవుతుందా అనేది ఇప్పుడు అందరికీ వస్తున్న సందేహం. 18 ఏండ్లు వచ్చిన వాళ్లు స్త్రీ అయినా, పురుషుడు అయినా మేజర్ అని రూల్స్ చెబుతున్నాయి. అయితే ఆడపిల్లల వివాహ వయస్సు 18, మగ పిల్లల వివాహ వయస్సు 21 ఎందుకు అనే ప్రశ్నకు ఎట్టకేలకు కేంద్రం ఫుల్‌స్టాప్ పెట్టిందనే చెప్పాలి. దేశంలోని అనేక ప్రాంతాలు, యూనివర్సిటీలు, వివిధ నేపథ్యాలు ఉన్న కుటుంబాల అభిప్రాయాలు టాస్క్‌ఫోర్స్ బృందం పరిగణనలోకి తీసుకుంది. వాటి ఆధారంగా మహిళల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి వివాహ వయసును పెంచాలని కేంద్రానికి సూచించింది. టాస్స్‌ఫోర్స్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఇండియాలో మహిళల వివాహ వయస్సును 18 నుంచి 21కి పెంచుతూ కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం స్వాగతించదగినదే.
మన దేశంలో ప్రతి ఏడాది 15 లక్షల బాల్యవివాహాలు జరుగుతున్నాయని యూనిసెఫ్ అంచనా వేసింది. ప్రపంచంలో జరిగే బాల్యవివాహాల్లో 47% మన దేశంలోనే జరుగుతున్నాయని ఐక్యరాజ్యసమితి, యునిసెఫ్ చెప్తోంది. అంటే మూడోవంతు మన దేశంలోనే జరుగుతుండడం దారుణమైన విషయం. ఆడపిల్లలు అంటే ‘ఆళ్ల’ పిల్లలే కదా అనే దురభిప్రాయం చాలా కుటుంబాల్లో ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాల్లో ఈ రకమైన అభిప్రాయం ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే పదో తరగతి చదువుతున్నప్పుడే ఆడపిల్లలకు పెళ్లి చేయాలని చాలామంది రెడీ అవుతున్నారు. ఈ విషయంలో రాజస్థాన్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. చదువుకున్న వారు కూడా బాల్యవివాహాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుండడం మరింత బాధాకరమైన అంశం. మగ పిల్లలు ఎక్కువ, ఆడ పిల్లలు తక్కువ అనే భావన నేటికీ అనేక కుటుంబాల్లో కనపడుతోంది. ఈ రకమైన ఆలోచనా ధోరణిని మార్చుకోవాల్సిన సమయం వచ్చింది.
మూఢ విశ్వాసాలను పక్కన పెట్టాలి
"లింగ సమానత్వం" దిశగా మన దేశం ముందుకు సాగాలి. మత, మూఢ విశ్వాసాలను, ఆచారాలను పక్కన పెట్టాలి. అందరూ సమానమే అనే భావనలోకి రావాలి. స్త్రీని దైవంగా కొలిచే ఈ దేశంలో, మహిళలు నిరంతరం వేధింపులకు గురవుతుండడం దారుణం. మన సంస్కృతి, సాంప్రదాయాల గురించి, పాశ్చాత్య దేశాల్లో గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆకలి బాధలు, వివక్ష, పేదరికం, అక్రమ రవాణా, అఘాయిత్యాలు, ఆత్మహత్యలు, యాసిడ్ దాడులు, పరువు హత్యలు, వరకట్న వేధింపులు, వ్యబిచార కూపాలు, అవహేళనలు, గృహ హింసలు, లైంగిక దోపిడీ, ర్యాగింగ్, రేప్‌ల వంటి దారుణాలు మన దేశంలో పెరిగిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో స్త్రీ గౌరవంగా బతికేది ఎప్పుడు? అనే ఆలోచన కలగాలి. అంబేద్కర్ చెప్పినట్లు "ఒక దేశ అభివృద్ధి, ఆ దేశ మహిళా అభివృద్ధిపైనే ఆధారపడి ఉంటుంది" అనే విషయాన్ని అందరూ గుర్తించాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చిత్తశుద్ధితో అమలు చేయాలి. అప్పుడే దేశంలో మహిళలకు రక్షణ, భద్రత, సమానత్వం సాధ్యమవుతాయి. పురుషులతో సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లో ఎదుగుతారు. దేశాభివృద్ధిలో తిరుగులేని శక్తిగా నిలబడతారు. దిశ యాప్, షీ టీం, మహిళా పోలీస్ స్టేషన్లు, నిర్భయ చట్టం ఉన్నా, దేశంలో ప్రతి నిమిషం ఏదో ఒక చోట మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.
గృహ హింస పెరిగిపోతోంది
దేశంలో గృహహింస కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఇవి మరింతగా పెరిగాయని రిపోర్టులు చెబుతున్నాయి. చట్టాలు ఎన్ని చేస్తున్నా సమాజంలో మహిళలపై చిన్న చూపు, వివక్ష కొనసాగుతూనే ఉన్నాయి. భ్రూణ హత్యలు తగ్గడంతో లింగ నిష్పత్తిలో తేడా కూడా తగ్గింది. ఇది మంచి పరిణామమే. ఇటీవల లెక్కల ప్రకారం 1000 మంది పురుషులకు, 1020 మంది మహిళలు ఉన్నారని రికార్డుల ద్వారా తెలుస్తోంది. బాలికా విద్యను బలోపేతం చేయాలి. పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి. ఆరోగ్య సేవా పథకాలను అమలు చేయాలి.
పౌష్టికాహార లోపం..
ముఖ్యంగా మహిళలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. బీఎంఐ సూచీలో వెనుకబడిపోతున్నారు. చిన్నప్పుడు తల్లిదండ్రుల అధీనంలో, వివాహం తరువాత భర్త చెప్పుచేతల్లో బొమ్మలాగా స్వతంత్రమైన ఆలోచన లేని వ్యక్తిగా నేటి ఆధునిక కాలంలో కూడా జీవిస్తుండడం శోచనీయం. ఇటువంటి పరిస్థితుల్లో మహిళల వివాహ వయస్సును 21కి పెంచడం ద్వారా మహిళలు కనీసం డిగ్రీ పూర్తి చేసే చాన్స్ ఉంటుంది. తన కాళ్లపై తాము నిలబడే స్థాయికి చేరి ఆర్థికంగా, సామాజికంగా, సమానత్వాన్ని సాధించే అవకాశం దక్కుతుంది. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా, తన కుటుంబానికి, పిల్లల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తుంది. మహిళా సాధికారత సాధ్యమవుతుంది. తల్లిదండ్రులు కూడా ఆడపిల్లల చదువు, ఎదుగుదలకు తోడ్పాటును అందించాలి. అప్పుడు మాత్రమే మహిళలు అభివృద్ధి చెందుతారు. అంతేగానీ, కేవలం వివాహ వయస్సు పెంపు ఒక్కటే, మహిళాభివృద్ధికి భరోసా ఇవ్వలేదని గుర్తుంచుకోవాలి.
చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి
"బేటీ బచావో.. బేటీ పడావో, విద్యా కానుక, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సుకన్య సమృద్ధి పథకం, బాలికా సమృద్ధి యోజన వంటి పథకాలు మహిళల అభివృద్ధికి కొంతవరకు తోడ్పాటునిస్తాయి తప్పితే మహిళలకు శాశ్వతంగా రక్షణ కల్పించలేవు అనే నిజాన్ని ప్రభుత్వాలు గ్రహించాలి. చదువు, ఆరోగ్య సేవలు, మహిళా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి. పార్లమెంట్‌లో పెండింగ్‌లో ఉన్న మహిళల రిజర్వేషన్ బిల్లును ఆమోదించి పాలకులు చిత్తశుద్ధి ఋజువు చేసుకోవాలి. మహిళలు స్వతంత్రంగా పని చేసే విధంగా సహాయపడాలి. "పదవి ఆమెది, పెత్తనం పెనిమిటిది (భర్త) అనే విధంగా ఉండకూడదు". ప్రస్తుత కాలంలో మహిళల వివాహ వయస్సు పెంపు మంచిదే కానీ ఆమె అభివృద్ధికి ప్రభుత్వాలు, కుటుంబ సభ్యులు, సమాజం సహకరిస్తేనే , ఏ ఉద్దేశంతో చట్ట సవరణకు సిద్ధపడుతున్నారో ఆ ఆశయం నెరవేరుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. మహిళా సాధికారతకు సామాజిక మాధ్యమాలు కూడా వెన్నుదన్నుగా నిలవాలి.
1978లో అప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముఖ్యంగా 'కుటుంబ నియంత్రణ' కోసం ఆడపిల్లల కనీస వివాహ వయస్సును 18గా నిర్ణయించారు. ఇప్పటివరకు మన దేశంలో దానినే అమలు చేస్తున్నారు. దీంతో చాలా మంది ఆడపిల్లల చదువు మధ్యలోనే ఆగిపోతోంది. ఆడపిల్లలకు పెండ్లి చేసే సమయంలో వారి శారీరక పెరుగుదలనే చూస్తున్నారు తప్ప.. మానసిక పరిపక్వతను పరిగణనలోకి తీసుకోవడం లేదు. 18 ఏండ్లు రాగానే పెండ్లి చేయడంతో 20 నుంచి 21 ఏండ్ల వయస్సులోనే వారు పిల్లలకు జన్మనిస్తున్నారు. ఏమీ తెలియని వయసులో పిల్లలకు జన్మనిస్తుండడంతో వారి సంరక్షణపై వారికి సరైన అవగాహన ఉండడం లేదు. దీంతో పిల్లల్లో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని సందర్భాల్లో మాతాశిశు మరణాలు సంభవిస్తున్నాయి.