హైదరాబాద్, వెలుగు: ఇటీవల ప్రారంభించిన 4 ప్రజా పాలన పథకాలను గ్రామాలవారీగా అమలు చేసేందుకు అధికారులు షెడ్యూల్ఖరారు చేస్తున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి లబ్ధిదారుల అకౌంట్లలో నిధులు జమచేయనున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి నిర్దేశించుకున్న గ్రామాల్లోని లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయాలని ఇప్పటికే ఆర్థిక శాఖకు ఆదేశాలు అందాయి. వీటితోపాటే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు కూడా పంపిణీ చేయాలని నిర్ణయించారు. మండలాలవారీగా అన్ని గ్రామాల్లో షెడ్యూల్ పై ఇప్పటికే అధికారులు ఒక క్లారిటీకి వచ్చారు. రాష్ట్రంలో 12,845 గ్రామాలు ఉన్నాయి. ఇందులో 563 గ్రామాల్లో ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక్కరోజే 4 స్కీమ్స్‌ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇక మిగిలిన గ్రామాల్లో రోజు విడిచి రోజు కనీసం 600 గ్రామాల చొప్పున 40 రోజుల వ్యవధిలో అన్ని గ్రామాల్లో స్కీమ్స్ పూర్తి చేసేలా షెడ్యూల్రూపొందిస్తున్నారు. ఒకవేళ రేషన్ కార్డులపై క్లారిటీ వస్తే.. రోజుకొక గ్రామం చొప్పున అయినా సరే నెలలోనే ప్రక్రియ పూర్తి చేసే ఆలోచన చేస్తున్నారు. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వారికి మార్చి 31 వరకు కంప్లీట్ చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.
గ్రామాలవారీగా రైతు భరోసా లిస్ట్
ప్రతి గ్రామంలో 4 స్కీమ్స్‌ను అమలు చేయాల్సి ఉండడంతో అన్ని శాఖలు సమన్వయం చేసుకోవాల్సి వస్తుంది. గృహ నిర్మాణ , వ్యవసాయ , పౌరసరఫరాలు, పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖలు ఆయా పథకాలకు సంబంధించిన లబ్ధిదారులను ఒక గ్రామంలో ఫైనల్ చేసుకున్నాకే ఆయా విలేజెస్‌కు షెడ్యూల్ ఇవ్వనున్నారు. గతంలో ఎకరాలవారీగా పెట్టుబడి సాయాన్ని రిలీజ్ చేశారు. ఇప్పుడు గ్రామాలవారీగా లిస్ట్‌ను ఫైనల్ చేస్తున్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి కూడా అదే పద్ధతి అమలు చేస్తున్నారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల జాబితాకు ఇన్చార్జి మంత్రుల ఆమోదం తీసుకోవాల్సి ఉంది. మార్చి 31 వరకు 4 స్కీమ్స్‌ను పూర్తి చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
అందులో భాగంగానే విడతలవారీగా అన్ని గ్రామాల్లో ప్రజా పాలన పథకాలను పూర్తి చేయనుంది. ఒక్క రేషన్ కార్డు మినహా మిగిలిన 3 పథకాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. దీంతో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను 600 గ్రామాలకే కాకుండా అంతకు రెట్టింపు గ్రామాల్లోనూ వేసే అవకాశం ఉంది. ఫలితంగా ఈ రెండు స్కీమ్స్‌ను గ్రామాల్లో ముందుగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. మొదటి రోజు మండలానికి ఒక గ్రామం చొప్పున 6 లక్షల15 వేల 677 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం నాలుగు స్కీమ్స్‌ను అమలు చేసింది. ఇందులో 4.41 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున మరో18,180 మంది రైతు కూలీల అకౌంట్లలో నూ రూ.6 వేల చొప్పున వేసింది. ఆయా గ్రామాల్లోని 15,414 కుటుంబాలకు కొత్త రేషన్‌కార్డులు, 72 వేల కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసింది.