
- ఆర్థిక శాఖ వద్ద అందుబాటులో రూ.10 వేల కోట్లు
- వ్యవసాయ, ఆర్థిక శాఖల మధ్య సమన్వయ లోపమే సమస్య?
- జనవరి 26 నుంచి ఇప్పటి వరకు రూ. 3 వేల కోట్లు పంపిణీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఖజానాలో కావాల్సిన నిధులున్నా.. రైతుల ఖాతాల్లో రైతు భరోసా పైసలు మాత్రం జమ కావడం లేదు. జనవరి 26న నారాయణపేట జిల్లా కోస్గిలో రైతు భరోసా స్కీంను సీఎం రేవంత్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. ఆ రోజు తొలి విడతగా 577 గ్రామాల్లోని 9,48,333 ఎకరాలకుగాను 4 లక్షల 41 వేల 911 మంది రైతుల అకౌంట్లలో రూ.593 కోట్లు జమ అయ్యాయి. ఇక వారం, పదిరోజుల్లో రాష్ట్రమంతా రైతుభరోసా పడ్తుందని రైతులంతా భావించారు.
కానీ గడిచిన నెలరోజుల్లో ఇప్పటివరకు కేవలం మూడు ఎకరాల్లోపు రైతులకు మాత్రమే రైతు భరోసా అందింది. మిగిలిన రైతులు తమ ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడ్తాయా? అని ఎదురు చూస్తున్నారు. రైతు భరోసాకు ఇబ్బంది కలగవద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం దాదాపు రూ.10 వేల కోట్లు ఖజనాలో అందుబాటులో ఉంచింది. కానీ ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖల మధ్య సమన్వయలోపం వల్లే రైతు భరోసా ఆలస్యం అవుతున్నట్టు తెలిసింది.
రెండు శాఖల మధ్య సమన్వయ లోపం?
రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఏడాదికి రూ.12వేల చొప్పున పెట్టుబడి సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా యాసంగి సీజన్‌కు ఎకరాకు రూ.6 వేల చొప్పున జమ చేయాల్సి ఉంది. సుమారు కోటి50 లక్షల ఎకరాలకు సంబంధించి ఈ సీజన్లో దాదాపు రూ.9 వేల కోట్లు ఖాతాల్లో వేయాలి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఆర్థిక శాఖ ప్రతిరోజూ రూ.2 వేల కోట్ల వరకు నిధులను బదిలీ చేసే అవకాశం ఉంది. ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాల చొప్పున విడతలవారీగా రైతుల ఖాతాల్లో నిధులు జమచేయవచ్చు.
ఇందుకోసం వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు రైతుల జాబితాను ఆన్లైన్లో ఆర్థిక శాఖకు అప్డేట్ చేయాలి. అందుకు అనుగుణంగా ఆర్బీఐకి, అటు నుంచి రైతుల ఖతాలకు పెట్టుబడి సాయం జమ అవుతుంది. అయితే, రైతుల వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి బిల్లుల రిలీజ్ కోసం ఆర్థికశాఖకు పంపినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. కానీ ఇప్పటికి మూడు విడతల్లో మూడు ఎకరాల వరకు రూ.3 వేల కోట్ల దాకా జమ చేసిన ఆర్థిక శాఖ మిగిలిన రైతు భరోసాను పక్కనపెట్టింది.
కొన్ని టెక్నికల్సమస్యలు రావడం వల్లే ఈ ప్రాసెస్ఆగిపోయినట్లు ఫైనాన్స్డిపార్ట్మెంట్అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద రెండు శాఖల నడుమ సమన్వయలోపం వల్ల రైతు భరోసా పడక రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో క్షేత్ర పర్యటనల్లో తాము రైతులకు సమాధానం చెప్పలేకపోతున్నామని మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు వాపోతున్నారు.
ఇప్పటిదాకా రూ.3 వేల కోట్ల సాయం
గడిచిన నెల రోజుల్లో మూడు విడతల్లో 3 ఎకరాల వరకు ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా పైసలు పడ్డాయి. మొదటి విడతలో ఎకరా వరకు ఉన్న 17.03 లక్షల మంది రైతులకు చెందిన 9.29 లక్షల సాగు భూమికి రూ.557.54 కోట్లను జమచేశారు. రెండో విడతలో 13.23 లక్షల మంది రైతులకు చెందిన18.19 లక్షల ఎకరాలకు 1,091.95 కోట్ల రూపాయలు, మూడో విడతలో 10.13 లక్షల మంది రైతులకు చెందిన 21.12 లక్షల ఎకరాలకు రూ.1,269.32 కోట్లు జమ చేశారు.
ఇప్పటిదాకా మొత్తంగా 3 ఎకరాలలోపు రైతులకు రూ.3 వేల కోట్ల దాకా జమ చేశారు. అయితే, మూడెకరాలలోపు ఉన్న రైతుల్లోనూ కొందరికి ఇంకా రైతు భరోసా జమ కాలేదని తెలిసింది. మరోవైపు రైతు భరోసా నిధుల జమ ఆలస్యమైతే.. అందుకోసం కేటాయించిన రూ. 10 వేల కోట్లలో కొంత మొత్తాన్ని ఇతర అవసరాలకు మళ్లించే అవకాశం కూడా లేకపోలేదని సెక్రటేరియట్ వర్గాలు చెప్తున్నాయి. అదే జరిగితే పెట్టుబడి సాయం మరింత ఆలస్యం అవుతుందని అంటున్నాయి.
సర్వే నంబర్ల బ్లాక్‌తో టెక్నికల్ సమస్య..
రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రాళ్లు, రప్పలు, గుట్టలు, వెంచర్లు, సాగుకు పనికి రాని ఇతర భూములకు పెట్టుబడి సాయం ఇవ్వకూడదని నిర్ణయించింది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో సర్వే చేసిన అధికారులు సాగుయోగ్యం కాని భూములను గుర్తించి, ప్రభుత్వానికి నివేదించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి భూములు 3 లక్షల ఎకరాలలోపు ఉన్నట్లు తేల్చి సర్వే నెంబర్లను బ్లాక్ చేయించారు. ఈ క్రమంలో సాగుయోగ్యమైన భూములు సైతం బ్లాక్ లిస్టులోకి వెళ్లాయి.
ఉదాహరణకు ఒక సర్వే నెంబర్ లో 20 ఎకరాల భూమి ఉంటే.. అందులో 5 ఎకరాలు మాత్రమే సాగుకు యోగ్యం కాకపోతే ఆ సర్వే నంబర్ లోని మిగిలిన 15 ఎకరాలు కూడా బ్లాక్‌లిస్టులోకి వెళ్లడం వల్ల ఆయా రైతులకు పెట్టుబడి సాయం జమకాలేదు. ఇప్పటివరకు రైతు భరోసా జమకాని భూములకు కూడా ఇదే సమస్య వచ్చే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తమైన వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ సహాయంతో ఈ టెక్నికల్ ఇష్యూను పరిష్కరిస్తోంది. ఇది కూడా రైతు భరోసా ఆలస్యానికి కొంతవరకు కారణమని భావిస్తున్నారు.