ఇక అన్ని మండలాల్లో రైతు నేస్తం

ఇక అన్ని మండలాల్లో రైతు నేస్తం
  •  వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌ ద్వారా రైతులకు సలహాలు ఇచ్చేందుకు చర్యలు
  • ఇప్పటివరకు పైలెట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ కింద రాష్ట్రంలోని 110 సెంటర్లలోనే అమలు
  • ఈ నెల 16 నుంచి మరో 456 రైతు వేదికల్లో అందుబాటులోకి..
  • ఎల్‌‌‌‌ఈడీ స్క్రీన్లు, సౌండ్‌‌‌‌ బాక్స్‌‌‌‌లు, కంప్యూటర్లు ఏర్పాట్లు చేస్తున్న ఆఫీసర్లు

కరీంనగర్, వెలుగు : రైతులకు శిక్షణ ఇచ్చేందుకు అమలుచేస్తున్న ‘రైతు నేస్తం’ కార్యక్రమం ఇక నుంచి అన్ని మండలాల్లో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే పైలెట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌గా నడుస్తున్న ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి మండలంలోని ఓ రైతు వేదికలో ఈ కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

సీడ్‌‌‌‌ ఎంపిక నుంచి పంట కోసే వరకు...

రైతు వేదికల్లో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌కు హైదరాబాద్‌‌‌‌ నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తలు హాజరుకానున్నారు. వీరు సీడ్‌‌‌‌ ఎంపిక నుంచి పంట కోసే వరకు సాగులో పాటించాల్సిన మెళకువలు, పంటను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. అంతేకాకుండా రైతులకు ఏమైనా సందేహాలు ఉంటే రైతు వేదిక నుంచే డైరెక్ట్‌‌‌‌గా శాస్త్రవేత్తలతో మాట్లాడి నివృత్తి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. పైలెట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ కింద ఇప్పటికే 110 రైతు వేదికల్లో నిర్వహించిన కార్యక్రమం ద్వారా సుమారు 50 వేల మందికి పైగా రైతులు శిక్షణ పొందారు. 

రాష్ట్రంలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కార్‌‌‌‌ హయాంలో ప్రతి 5 వేల ఎకరాలను ఒక క్లస్టర్‌‌‌‌గా విభజించి క్లస్టర్‌‌‌‌కు ఒకటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2,601 రైతు వేదికలను నిర్మించింది. 200 మంది రైతులు కూర్చునేందుకు వీలుగా హాల్, రిసెప్షన్‌‌‌‌తో పాటు రెండు టాయిలెట్లను నిర్మించారు. వీటి నిర్వహణను అగ్రికల్చర్‌‌‌‌ ఎక్స్‌‌‌‌టెన్షన్‌‌‌‌ ఆఫీసర్ల (ఏఈవో)కు అప్పగించారు. రైతు వేదిక మెయింటనెన్స్, కరెంట్‌‌‌‌బిల్లు, ఇతర సౌకర్యాల కోసం ప్రతి నెలా రూ.9 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. కానీ రైతు వేదికలను నిర్మించిన అప్పటి ప్రభుత్వం అసలు ఉద్దేశాన్ని మాత్రం విస్మరించింది. 

ఆ వేదికల్లో రైతులకు ఎలాంటి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించకపోగా, నిర్వహణకు సైతం నిధులు విడుదల చేయలేదు. దీంతో ఆ రైతు వేదికలన్నీ అధ్వానంగా మారాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు వేదికలను వినియోగంలోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వేదికల్లో రైతులకు శిక్షణతో పాటు వివిధ పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలాగే రైతు బంధు, రైతు బీమా, ఆయిల్‌‌‌‌ పామ్‌‌‌‌ సాగు కోసం అప్లికేషన్లను సైతం ఇక్కడే తీసుకుంటున్నారు.