హనుమకొండ జడ్పీ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో..రైతుబంధు రచ్చ

  • పెట్టుబడిసాయం వేస్తలేరని ఆఫీసర్లపై మండిపడ్డ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు
  •     ఎప్పటికప్పుడు రైతుల ఖాతాల్లో వేస్తున్నామన్న ఆఫీసర్లు
  •     ‘ప్రజాపాలన’కు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లను పిలవడం లేదని ఆగ్రహం
  •     జడ్పీ మీటింగ్‌‌‌‌‌‌‌‌ను బైకాట్‌‌‌‌‌‌‌‌ చేసిన ప్రజాప్రతినిధులు

హనుమకొండ, వెలుగు : ‘రైతుబంధు విడుదల చేస్తే ఆ పైసలతోనే రైతుల ఖర్చులు వెళ్లిపోయేవి, కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడి రోజులు గడుస్తున్నా ఇంతవరకూ రైతుబంధు ఇస్తలేరు. పెట్టుబడికి పైసల్లేక రైతులు ఇబ్బంది పడుతున్నరు, పెట్టుబడి సాయం ఇంకెప్పుడిస్తరు’ అంటూ ఎంపీపీలు, జడ్పీటీసీలు ఆఫీసర్లను నిలదీశారు. ఆఫీసర్లు సమాధానం చెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో హనుమకొండ జడ్పీ మీటింగ్‌‌‌‌‌‌‌‌ గందరగోళంగా సాగింది. 

జడ్పీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ సుధీర్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షతన హనుమకొండలోని జడ్పీ హాల్‌‌‌‌‌‌‌‌లో శనివారం జనరల్‌‌‌‌‌‌‌‌ బాడీ మీటింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. సమావేశానికి జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు, జడ్పీ వైస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ గజ్జెల శ్రీరాములు, జడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే సభ్యులంతా రైతుబంధుపైనే వ్యవసాయాధికారులను నిలదీశారు. రైతుబంధు ఎన్ని ఎకరాలకు వరకు ఇస్తున్నారో అర్థం కావడం లేదని, ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. 

దీంతో ఎకరంలోపు భూమి ఉన్న రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నామని, ఇప్పటివరకు జిల్లాలోని 52,325 మంది రైతుల ఖాతాల్లో రూ.13.58 కోట్లు జమ చేసినట్లు ఆఫీసర్లు చెప్పారు. రుణమాఫీ విషయం గురించి సభ్యులు నిలదీయగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని, క్లారిటీ రాగానే ఆ ప్రక్రియ కూడా పూర్తి చేస్తామని ఆఫీసర్లు సమాధానమిచ్చారు. 

గత ప్రభుత్వం నిధులు విడుదల చేసినా దళితబంధు ఇవ్వడం లేదని వేలేరు ఎంపీపీ సమ్మిరెడ్డి చెప్పగా రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదని ఎస్సీ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ ఈడీ సమాధానం ఇచ్చారు. ఉదయం 10.45 గంటలకు ప్రారంభమైన జడ్పీ మీటింగ్‌‌‌‌‌‌‌‌ మధ్యాహ్నం 1.30 వరకు కొనసాగింది. కాగా కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన కేఆర్.నాగరాజు మొదటిసారి మీటింగ్‌‌‌‌‌‌‌‌కు రావడంతో సభ్యులంతా ఆయనను సన్మానించారు. 

ప్రజాపాలనకు పిలుస్తలేరని బైకాట్‌‌‌‌‌‌‌‌

ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాలకు తమను ఆహ్వానించడం లేదని, అధికారులు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని జడ్పీటీసీ వంగ రవితో పాటు మరికొందరు సభ్యులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ప్రజాపాలన ప్రభుత్వ కార్యక్రమమో.. పార్టీ ప్రోగ్రామో అర్థం కావడం లేదన్నారు. జిల్లా స్థాయి మీటింగ్‌‌‌‌‌‌‌‌ల విషయం తమను చెప్పకపోతే ప్రజల సందేహాలను నివృత్తి చేసే అవకాశం ప్రజాప్రతినిధులుగా మాకెలా ఉంటుందని ప్రశ్నించారు. 

ప్రజాపాలన కార్యక్రమానికి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లను ఆహ్వానించకపోవడం తమను అవమానించినట్లేనంటూ సభ్యులంతా సమావేశాన్ని బైకాట్‌‌‌‌‌‌‌‌ చేశారు. హాల్‌‌‌‌‌‌‌‌లో సభ్యులెవరూ లేకపోవడంతో మీటింగ్‌‌‌‌‌‌‌‌ ముగిసిందని జడ్పీచైర్మన్‌‌‌‌‌‌‌‌ సుధీర్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ ప్రకటించారు.

ప్రజాపాలనలో లొసుగులున్నయ్‌‌‌‌‌‌‌‌

ప్రజాపాలనలో లొసుగులు ఉన్నాయని, అందుకే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రజాప్రితనిధులను పిలవడం లేదని జడ్పీచైర్మన్‌‌‌‌‌‌‌‌ సుధీర్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ విమర్శించారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్​అయితే ఇబ్బందులు వస్తాయని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు భయపడుతున్నారన్నారు. ప్రజాపాలన అప్లికేషన్లలో అటో ఫొటో.. ఇటో ఫొటో పెట్టి పెండ్లి పత్రికలు పంచినట్టు పంచుతున్నారని ఎద్దేవా చేశారు. కౌలు రైతులను ఎలా డిసైడ్‌‌‌‌‌‌‌‌ చేస్తారో క్లారిటీ ఇవ్వాలన్నారు. 

హామీలన్నీ అమలు చేస్తాం 

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పాలన నచ్చకపోవడం వల్లే ప్రజలు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు పట్టం కట్టారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థి, నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగాయి. గతంలో 15వ తేదీ దాటినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు. అందుకే అంతా కలిసి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పాలనను కోరుకున్నరు. రైతుబంధు, దళితబంధు, ఎస్సీ, ఎస్టీ సబ్‌‌‌‌‌‌‌‌ప్లాన్‌‌‌‌‌‌‌‌పై త్వరలోనే ఇన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్స్‌‌‌‌‌‌‌‌ వస్తాయి. ప్రజాపాలనలో అందరికీ కలుపుకొని పోవాలని ఆఫీసర్లకు సూచించాం.
- నాగరాజు, వర్ధన్నపేట ఎమ్మెల్యే