కేటీఆర్ విచారణపై రాజ్​భవన్ సైలెన్స్​

  • ఫార్ములా ఈ రేస్​ కేసులో నెల గడుస్తున్నా  ఫైల్​ పెండింగ్​
  • ఏసీబీ ప్రాసిక్యూషన్​కు గవర్నర్​అనుమతి కోరిన ప్రభుత్వం
  • సీఎం కామెంట్స్​తో మరోసారి చర్చ
  • పర్మిషన్​ రాకున్నా కస్టడీలోకి తీసుకుని
  • విచారించే యోచనలో సర్కారు!

హైదరాబాద్, వెలుగు: ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్​ ప్రాసిక్యూషన్​పై  రాజ్​భవన్​ సైలెన్స్​ మెయింటెయిన్​ చేస్తున్నది. దీంతో ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందోననే సందిగ్ధం నెలకొన్నది. నెల కిందట ప్రాసిక్యూషన్​ కోసం గవర్నర్​ అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం  లేఖ పంపింది. సీఎం రేవంత్​ కూడా తన సోదరుడి కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను ఇచ్చేందుకు గవర్నర్ జిష్ణుదేవ్​ వర్మను ప్రత్యేకంగా కలిసిన సందర్భంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది. అయినప్పటికీ గవర్నర్​ ఇంకా నిర్ణయం  తీసుకోలేదు. ఆ తర్వాత గవర్నర్ ఢిల్లీ వెళ్లి వచ్చారు.

ఈ సందర్భంగా ఆయన అటార్నీ జనరల్​ నుంచి న్యాయ సలహా తీసుకున్నారనే చర్చ జరిగింది.అదే సమయంలో కేటీఆర్ పై​ ప్రాసిక్యూషన్​ పర్మిషన్​కు సంబంధించిన ఫైల్​ను గవర్నర్​ ప్రత్యేకంగా చూస్తున్నారంటూ రాజ్​భవన్​వర్గాలు పేర్కొంటున్నాయి.  ఒకవైపు కేటీఆర్ ను అరెస్ట్​ చేయాల్సిందేనని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ డిమాండ్​ చేస్తుండగా.. మరోవైపు గవర్నర్​ పర్మిషన్​ రాకుండా కేంద్రంలోని బీజేపీ పెద్దలతో పైరవీ చేసుకుంటున్నారని కాంగ్రెస్​ నుంచి సీఎం రేవంత్​ రెడ్డి, మంత్రులు  ఆరోపిస్తున్నారు. ఇటీవల 2 సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్​ రెడ్డి ఇదే అంశాన్ని ప్రస్తావించారు.

అంతకుముందు గవర్నర్​ దగ్గర కేటీఆర్​ ప్రాసిక్యూషన్​కు సంబంధించిన అనుమతి పెండింగ్​లో ఉందని తెలిపారు. మొన్నటి పర్యటన కంటే ముందు నిర్వహించిన ప్రెస్​మీట్​లో గవర్నర్​ అనుమతి ఇవ్వకుండా కేసు నుంచి తప్పించుకునేందుకు కేటీఆర్​ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ కాళ్లు పట్టుకుంటున్నారని ఆరోపించారు. దీంతో ఫార్ములా ఈ రేస్​ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నది. ఒకవేళ గవర్నర్​ అనుమతి రాకపోతే ముందుకు వెళ్తే న్యాయపరంగా ఎలాంటి చిక్కులు వస్తాయి ? దానికి ప్రభుత్వం ఎలా సిద్ధంగా ఉండాలనే దానిపైనా ఆరా తీస్తున్నది. 

పర్మిషన్​ రాకున్నా కస్టడీలోకి!

గవర్నర్​ అనుమతి నిర్ణయంపై ఇంకా కొంతకాలం చూసి..  తదుపరి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది.  ‘‘ఒకవేళ గవర్నర్​ నుంచి అనుమతి వస్తే దానికి తగ్గట్టుగా ముందుకు వెళ్తారు. పర్మిషన్​ రాకుంటే కేటీఆర్​ను అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం ఉన్నది’’ అని సెక్రటేరియెట్​లోని ఉన్నతాధికారి ఒకరు 'వెలుగు'కు తెలిపారు. ఏపీలో గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడును అరెస్ట్​ చేసిందని, గవర్నర్​ అనుమతి లేకుండా చేయడంపై సుప్రీంకోర్టు కూడా ప్రత్యేక విచారణ చేపట్టిందని ఆ అధికారి వివరించారు.

అయితే ఒకసారి అదుపులోకి తీసుకొని అవినీతి జరిగిందని, ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం జరిగిందని నిరూపించగలిగితే  కోర్టులనుంచి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండబోదని అనుకుంటున్నట్టు తెలిపారు. ఎఫ్ఐఆర్​లో పేరు నమోదు చేయకున్నా.. కస్టడీకి తీసుకొని విచారణ చేసి.. నేరుగా చార్జ్​షీట్​లోనే పేరును చేర్చేందుకు అవకాశం ఉన్నది.  దీంతో ఈ రకంగాను ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి కేసుల్లో ఎలా ముందుకు వెళ్లారనే దానిపై కూడా  స్టడీ చేస్తున్నారు.