కుటుంబ పాలన, అవినీతి పరిపాలన పోవాలనే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ బాగుపడుతుందని అన్నారు. ఈ నెల 21వ తేదీన మునుగోడు మండల కేంద్రానికి కేంద్ర మంత్రి అమిత్ షా వస్తున్నారని, ఆయన సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే బహిరంగసభకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై, సభను విజయవంతం చేయాలంటూ పిలుపునిచ్చారు. తెలంగాణ భవిష్యత్ కోసం ఎన్నిక జరగబోతోందని, మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పునివ్వాలని కోరారు. తనపై ఆరోపణలు చేసిన వారు నిరూపించాలంటూ సవాల్ విసిరారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, అయినా 25 రోజుల నుంచి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనపై వస్తున్న అసత్య ప్రచార విషయంలో మునుగోడు ప్రజలు, తెలంగాణ సమాజం ఆలోచించాలని కోరారు.
చౌటుప్పల్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై పోస్టర్లు వెలిశాయి. దీనిపై చండూరులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. తనకు నైతిక విలువలు ఉన్నాయని, 13 సంవత్సరాల్లో తాను ఎన్నడూ తప్పు చేయలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనమై పోయిందన్నారు. టీఆర్ఎస్ లోకి రావాలని గతంలోనే పిలుపు వస్తే వెళ్లలేదని చెప్పారు. కేసీఆర్ సర్కార్ మునుగోడు ప్రజలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. కేవలం ఉప ఎన్నిక సందర్భంలోనే నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. తాను అమిత్ షాతో భేటీ అయిన అనంతరం గట్టుప్పల్ ని మండలంగా ప్రకటించలేదా.. ? తన రాజీనామాతో పెన్షన్ లు రాలేదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.