హైదరాబాద్: జన్వాడలోని ఫామ్హౌస్లో కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల దావత్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. హైకోర్టులో రాజ్ పాకాల లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాడు. పోలీసులు తనని అక్రమంగా అరెస్టు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారన్న సమాచారం ఉందని కేటీఆర్ బామ్మర్ది హైకోర్టును ఆశ్రయించాడు. రాజ్ పాకాల పరారీలో ఉండటంతో మోకిలా పోలీసులు అతనికి నోటీసులు జారీ చేశారు.
ఓరియన్ విల్లాస్లోని విల్లా 40లోని తన ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. ఈరోజు విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడం గమనార్హం. BNSS సెక్షన్ 35(3) కింద నోటీసులు ఇచ్చామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో రాజ్ పాకాలను A1గా చేర్చిన పోలీసులు, A2గా విజయ్ మద్దూరిని పేర్కొనడం గమనార్హం.
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడ పరిధిలో కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలకు 8 ఎకరాల్లో ఫామ్‌హౌస్ ఉంది. రాజ్ పాకాల రెండు ఐటీ కంపెనీలు నిర్వహిస్తున్నాడు. ఫామ్‌హౌస్‌లో వీకెండ్స్‌తో పాటు ఇతర సమయాల్లో ఈవెంట్స్ జరుగుతుంటాయి. శనివారం రాత్రి ఆ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు, భారీ శబ్దాలతో న్యూసెన్స్ చేస్తున్నట్లు రాత్రి 10.30 గంటల సమయంలో డయల్ 100కు కాల్ వచ్చింది.
Also Read:-కేటీఆర్ బామ్మర్ధి రాజ్ పాకాలకు నోటీసులు
దీంతో సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులతో స్థానిక మోకిల పోలీసులు, ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రాత్రి 11.30 గంటల సమయంలో ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారనే సమాచారంతో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. పోలీసులు చేరుకున్న వెంటనే అక్కడున్న వారంతా అప్రమత్తమయ్యారు. పారిపోయేందుకు ప్రయత్నించారు. పార్టీలో 22 మంది పురుషులు,18 మంది మహిళలతో పాటు ఐదుగురు పిల్లలున్నట్టు పోలీసులు గుర్తించారు. ఒక్కో టేబుల్దగ్గర నాలుగేసి కుర్చీల చొప్పున వేసి ఉన్నాయి. వాటి దగ్గర క్యాసినో కాయిన్స్, ప్లేయింగ్ కార్డ్స్ కనిపించాయి.
ఒక దగ్గర బార్సెంటర్పై లిక్కర్ బాటిల్స్కనిపించాయి. అయితే, డ్రగ్స్ పార్టీ జరిగిందనే అనుమానంతో వారికి కిట్స్‌తో టెస్ట్‌లు చేసేందుకు యత్నించగా సహకరించలేదు. మహిళలు ససేమిరా అనడంతో వారికి టెస్టులు చేయలేదు. మిగిలిన వారిపై పోలీసులు సీరియస్ కావడంతో అంగీకరించారు. 22 మందికి డ్రగ్స్ రాపిడ్ టెస్ట్‌లు చేయగా ప్రముఖ వ్యాపారి విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నట్లు నిర్ధారణయింది.
కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల పరారీలో ఉన్నాడు. తనకు రాజ్ పాకాల డ్రగ్స్ ఇచ్చి వాడమన్నాడని పోలీసుల విచారణలో విజయ్ మద్దూరి స్పష్టం చేయడం సంచలనం సృష్టిస్తున్నది. రాజ్కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే అతడు పరారీలో ఉన్నాడని, ఫోన్స్విచ్ఛాఫ్చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.