ఫారిన్ లిక్కర్ ఎక్కడిది?.. రాజ్ పాకాలను ప్రశ్నించిన ఎక్సైజ్ అధికారులు

ఫారిన్ లిక్కర్ ఎక్కడిది?.. రాజ్ పాకాలను ప్రశ్నించిన ఎక్సైజ్ అధికారులు
  • లోకల్ మందుతోనే పార్టీ చేసుకున్నామన్న రాజ్  
  • ఫారిన్ లిక్కర్ సంగతి ఫామ్ హౌస్ సూపర్ వైజర్ కార్తీక్​కే తెలుసంటూ సమాధానం!
  • నాగేశ్వర్ రెడ్డిని కూడా విచారించిన పోలీసులు

చేవెళ్ల, వెలుగు: లోకల్ లిక్కర్ తోనే తన ఫామ్ హౌస్ లో పార్టీ చేసుకున్నామని కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఎక్సైజ్ పోలీసుల విచారణలో తెలిపాడు. ఒకవేళ తన ఫామ్ హౌస్ లో ఫారిన్ లిక్కర్ ఉండి ఉంటే, అది సూపర్​వైజర్​కార్తీక్ (ఏ1)​కే తెలుసని చెప్పాడు. ‘మీకు తెలియకుండా మీ ఫామ్​హౌస్​లోకి ఫారిన్​లిక్కర్​ఎలా వచ్చింది?’ అని అధికారులు ప్రశ్నించగా.. తనకు తెలియదని సమాధానమిచ్చాడు. జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో రాజ్ పాకాల (ఏ2), నాగేశ్వర్ రెడ్డి (ఏ3)ని శుక్రవారం చేవెళ్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో విచారించారు. ఇద్దరిని వేర్వేరుగా ప్రశ్నించారు. రాజ్​పాకాల విచారణ మధ్యాహ్నం 1:50 గంటలకు ప్రారంభమై రాత్రి 8:18  గంటలకు ముగిసింది. మధ్యలో మూడున్నర గంటల ప్రాంతంలో లంచ్​బ్రేక్​ఇచ్చారు. ఇక నాగేశ్వర్ రెడ్డిని సాయంత్రం 5:30 గంటల నుంచి 9 గంటల వరకు విచారించారు. వీరిని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ్, ఎక్సైజ్ ఎన్​ఫోర్స్​మెంట్​ఏఈఎస్ జీవన్ కిరణ్, చేవెళ్ల సీఐ శ్రీలత ప్రశ్నించారు.   

దాదాపు 50 ప్రశ్నలు.. 

ఫామ్​హౌస్​లో దొరికిన 7 లీటర్ల ఫారిన్​లిక్కర్​ఆధారంగానే రాజ్ పాకాలను ఎక్సైజ్ అధికారులు ఎక్కువ ప్రశ్నలు అడిగారు. ‘‘దావత్ కు పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు? ఫారిన్​లిక్కర్​ఎక్కడి నుంచి ఎంత తెచ్చారు? ఏ విమానంలో, ఎవరు తీసుకొచ్చారు? ఎయిర్ పోర్టులో చెక్ చేయలేదా? తనిఖీల నుంచి ఎలా తప్పించుకున్నారు? హైదరాబాద్ కు తెచ్చినంక ఎవరింట్లో పెట్టారు? ఎక్సైజ్ డ్యూటీ ఎందుకు కట్టలేదు? ఫారిన్ లిక్కర్​కు బిల్లు ఉందా? పార్టీకి తెచ్చిన మందు తెలంగాణలో ఎక్కడ కొన్నారు? దాని బిల్లు ఉందా?’’ అని దాదాపు 50 ప్రశ్నలు సంధించారు. అయితే తన ఫామ్​హౌస్​లో ఫారిన్​లిక్కర్​దొరికి ఉండొచ్చని, కానీ దానితో తనకేం సంబంధం లేదని, అదంతా సూపర్​వైజర్​కార్తీక్​కే తెలుసని రాజ్ పాకాల సమాధానమిచ్చాడు. ఇక కొన్ని ప్రశ్నలకు తెలియదు, గుర్తులేదు అని జవాబిచ్చినట్టు సమాచారం. కాగా, ఈ కేసులో ఏ3గా ఉన్న నాగేశ్వర్ రెడ్డిని కూడా ఎక్సైజ్ పోలీసులు విచారించారు. ఓరియన్ విల్లాలో నాగేశ్వర్ రెడ్డి ఇంట్లో 49  బాటిల్స్​దొరకగా, అందులో 28 బాటిల్స్​ఫారిన్​లిక్కర్​ఉంది. ఇందులో ఆరు ఫుల్​బాటిల్స్​కాగా, మిగతా 22 ఖాళీ బాటిల్స్. దీంతో వాటికి సంబంధించే నాగేశ్వర్​రెడ్డికి ప్రశ్నలు వేశారు. 

లోకల్ మందుతో చిన్న దావతే: రాజ్ పాకాల 

విచారణ తర్వాత రాజ్ పాకాల ఇంటికి వెళ్తూ మీడియాతో మాట్లాడాడు. ‘‘ఎక్సైజ్ పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన. చిన్న దావత్ చేసుకున్నమని చెప్పిన. ఫామ్ హౌస్ లోపల దొరికింది లోకల్​మందే.. దాన్నే సీజ్ చేశారు. సివిల్ పోలీసులు కూడా విచారణ చేశారు కదా.. ఏముంది దావత్ చేసుకున్నామని చెప్పినా అంతే” అని తెలిపాడు.