హైదరాబాద్: జన్వాడ ఫామ్ హౌస్ కేసులో కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల విచారణ ముగిసింది. 2024, అక్టోబర్ 30న దాదాపు 9 గంటల పాటు రాజ్ పాకాలను మోకిలా పోలీసులు ప్రశ్నించారు. ఈ కేసులో మరో నిందితుడు విజయ్ మద్దూరి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా రాజ్ పాకాలపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. విచారణ ముగిసిన అనంతరం రాజ్ పాకాలకు పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసులు ఇచ్చి.. మళ్లీ పిలిచినప్పుడు విచారణకు రావాలని ఆదేశించారు. రాజ్ పాకాల మొబైల్ ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు.
ALSO READ | కేటీఆర్ బామ్మర్ది కేసులో కొత్త ట్విస్ట్.. జన్వాడ ఫామ్ హౌస్కు ఎవరొచ్చారో తెలుసా..?
విచారణ ముగిసిన అనంతరం పోలీస్ స్టేషన్ వద్ద రాజ్ పాకాల మీడియాతో మాట్లాడారు. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించానని.. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని తెలిపారు. తన ఫామ్ హౌస్లో జరిగింది రేవ్, డ్రగ్ పార్టీ కాదని.. అది ఫ్యామిలీ పార్టీ అని ఈ సందర్భంగా రాజ్ పాకాల క్లారిటీ ఇచ్చారు. ఇంట్లో ఫ్యామిలీ పార్టీ కూడా చేసుకోకూడదా అని ప్రశ్నించారు. ఈ కేసులో పోలీసుల వైఖరి వల్ల మా కుటుంబం చాలా డిస్టర్బ్ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయ్ మద్దూరి ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదన్నారు. ఎవరికో డ్రగ్ పాజిటివ్ వస్తే నాకేంటి సంబంధం అని ప్రశ్నించారు. తన ఇంట్లో జరిగిన ఫ్యామిలీ పార్టీని కావాలనే పెద్దదిగా చిత్రీకరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
ALSO READ | జన్వాడ ఫామ్ హౌస్ కేసులో బిగ్ ట్విస్ట్.. కేటీఆర్ బామ్మర్ది ఫోన్ సీజ్
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడ పరిధిలో అక్టోబర్ 26న కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలకు చెందిన ఫామ్‌హౌస్‌లో పార్టీ జరిగింది. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించినందుకు, ఫారిన్లిక్కర్వాడినందుకు ఎక్సైజ్ యాక్ట్ కింద కూడా కేసు ఫైల్‌చేశారు. ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన సోదాల్లో 12 ఫారిన్ లిక్కర్ బాటిల్స్.. ఢిల్లీ, మహారాష్ట్రకు చెందిన రెండు నాన్ డ్యూటీ లిక్కర్ బాటిల్స్.. 11 కేఎఫ్ బీర్లు.. 7.35 లీటర్లు టీజీ ఐఎంఎఫ్‌ఎల్ బాటిల్స్ ను పోలీసులు పట్టుకున్నారు. వీటితో పాటు పెద్ద మొత్తంలో క్యాసినో కాయిన్స్, ప్లేయింగ్ కార్డ్స్ సీజ్ చేశారు.
ALSO READ | జన్వాడ ఫామ్ హౌస్ కేసు: రాజ్ పాకాలను 8 గంటలు విచారించిన పోలీసులు
పార్టీలో 22 మంది పురుషులు,18 మంది మహిళలతో పాటు ఐదుగురు పిల్లలున్నట్టు పోలీసులు గుర్తించారు. 22 మందికి డ్రగ్స్ర్యాపిడ్ టెస్ట్‌లు చేయగా ప్రముఖ వ్యాపారి విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నట్లు నిర్ధారణయింది. ఎన్‌డీపీఎస్‌యాక్ట్, తెలంగాణ గేమింగ్ యాక్ట్ కింద కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల (50), విజయ్ మద్దూరి (55), ఫామ్‌హౌస్ మేనేజర్ కార్తీక్(30)పై మోకిలా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ఏ1గా రాజ్‌పాకాల, ఏ2గా విజయ్మద్దూరి, ఏ3గా కార్తీక్ను చేర్చారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే విజయ్ మద్దూరిని విచారించిన పోలీసులు.. తాజాగా ఇవాళ రాజ్ పాకాలను ప్రశ్నించారు.