విజయ్​కి ఇచ్చిన కొకైన్​ ఎక్కడిది?

విజయ్​కి ఇచ్చిన కొకైన్​ ఎక్కడిది?
  •      మీ ఇంటి దావతే అయితే మీ బావ కేటీఆర్​ రాలేదా?
  •      రాజ్​ పాకాలను ప్రశ్నించిన పోలీసులు
  •     పార్టీకి వచ్చిన ప్రముఖులెవరు.. ఫారిన్​ మందు ఎక్కడి నుంచి తెచ్చిన్రు? 
  •     తప్పు చేయకపోతే దావత్​ నుంచి ఎందుకు పారిపోయినవ్​
  •     ఆరా తీసిన పోలీసులు.. తెలియదు, గుర్తులేదన్న రాజ్​!
  •     ఫామ్​హౌస్​లో సీన్​ రీక్రియేషన్​

చేవెళ్ల, వెలుగు : జన్వాడ ఫామ్​హౌస్ పార్టీ కేసు విచారణ ఊపందుకుంది. దావత్​ జరిగిన తర్వాత కనిపించకుండా పోయిన కేటీఆర్ బామ్మర్ది, ఏ1 రాజ్ పాకాల బుధవారం మోకిల పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యాడు. రాజ్​ పాకాల ఇచ్చిన ఈ పార్టీలో పాల్గొన్న విజయ్​ మద్దూరికి డ్రగ్స్ (కొకైన్​)  పాజిటివ్​ అని తేలడంతో.. కొకైన్​ను ఎక్కడి నుంచి తెచ్చారనే దానిపై పోలీసులు ఫోకస్​ పెట్టారు. ఇదే అంశంపై రాజ్​ పాకాలను ప్రశ్నించినట్లు తెలిసింది. దావత్ ​నుంచి ఎందుకు పారిపోయావని, రెండు రోజులు ఎక్కడ ఉన్నావని ఆరా తీసినట్లు సమాచారం.

‘‘ఫామ్​హౌస్​లో జరిగింది మీ ఇంటి దావతే  అయితే మీ బావ కేటీఆర్ రాలేదా? లేకపోతే ముందే ఆయన వచ్చి వెళ్లిపోయారా? పోలీస్  రైడ్ అవుతుందని తెలిసి వెళ్లిపోయారా?” అని రాజ్​ పాకాలను ప్రశ్నించినట్లు తెలిసింది. పార్టీకి వచ్చిన ప్రముఖులెవరని, విదేశీ మద్యం ఎక్కడి నుంచి తెచ్చారని, ఎంత తెచ్చారని కూడా ప్రశ్నించినట్లు సమాచారం. వీటిలో కొన్ని ప్రశ్నలకు తెలియదని.. మరికొన్ని ప్రశ్నలకు గుర్తులేదని రాజ్​ చెప్పినట్లు తెలిసింది. తనను అరెస్ట్​చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని రెండు రోజుల కింద రాజ్​ పాకాల హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు పర్మిషన్​ ఇచ్చింది.

బుధవారం 12 గంటల వరకే పోలీసుల ముందు హాజరుకావాలని ఆదేశించింది. దీంతో ఆయన బుధవారం మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు తన న్యాయవాదులతో కలిసి రంగారెడ్డి జిల్లా సైబరాబాద్​కమిషనరేట్​పరిధిలోని మోకిల పోలీస్​స్టేషన్ కు వచ్చారు. నార్సింగి ఏసీపీ రమణ గౌడ్, మోకిల సీఐ వీరబాబు, శంకర్ పల్లి సీఐ శ్రీనివాస్ గౌడ్, నార్సింగి డీఐ శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో రాజ్​ పాకాల విచారణ కొనసాగింది. అంతకుముందే ఆయన సెల్ ఫోన్​ను పోలీసులు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.  

పార్టీకి ఎవరెవరు వచ్చారు? 

విచారణలో భాగంగా రాజ్​ పాకాలకు పోలీసులు పలు ప్రశ్నలు వేశారు. విజయ్ మద్దూరి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే విచారణ కొనసాగినట్టు తెలిసింది. ‘‘ఫామ్ హౌస్ పార్టీకి ఎవరెవరు హాజరయ్యారు? అందులో మీ స్నేహితులు ఎంతమంది ఉన్నారు.. బంధువులు ఎంతమంది ఉన్నారు.. విజయ్​మద్దూరికి డ్రగ్స్​ఇచ్చారా? మీరే ఇచ్చారని ఆయన చెప్తున్నారు.. దానికి మీ సమాధానం ఏమిటి? ఆ డ్రగ్స్​ఎక్కడి నుంచి తెచ్చారు?

ఇచ్చిన వారి పేరేంటి? తప్పు చేయకపోతే దావత్​ నుంచి ఎందుకు పారిపోయావ్​?’’ అని ప్రశ్నించినట్టు సమాచారం. గతంలో జరిగిన పార్టీలపైనా ఆరా తీసినట్లు తెలిసింది. విజయ్​ప్రస్తుతం ఎక్కడున్నాడని ప్రశ్నించగా.. అక్కడే ఉన్న అతడి న్యాయవాదులు కాంటినెంటల్​హాస్పిటల్​లో చికిత్స పొందుతున్నారని చెప్పారు.  

డిజిటల్​లాకర్​లో బెడ్​రూంల తాళాలు!

పోలీస్​స్టేషన్​లో రాజ్​పాకాల  విచారణ పూర్తయిన తర్వాత అతడ్ని మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాలకు జన్వాడలోని ఫామ్ హౌస్ కు తీసుకువెళ్లారు. అక్కడ సీన్​రీక్రియేషన్​చేశారు. పార్టీకి ఎవరెవరు వచ్చారు? ఎక్కడెక్కడ కూర్చున్నారు? ఎక్కడ ఏం చేశారు.. లాంటి వివరాలను రాజ్​ను అడిగి తెలుసుకున్నారు. ఫామ్​హౌస్​లో నాలుగు బెడ్​రూంలు ఉండగా, అన్నింటినీ తనిఖీ చేశారు. ప్రతి బెడ్​రూం తాళాలు డిజిటల్​లాకర్​లోని అల్యూమినియం బాక్స్​లో భద్రపరిచి ఉండగా.. దాన్ని కోడ్​తో రాజ్​ పాకాల ఓపెన్​చేసి తాళాలు తీసిచ్చాడు. నాలుగు బెడ్ రూమ్స్​లోకి వెళ్లిన పోలీసులు కప్​బోర్డులను చెక్​చేశారు.

అక్కడున్న కొన్ని ఫైల్స్​పరిశీలించారు. ఈ సందర్భంగా కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తున్నది. సాయంత్రం 4.30 గంటల వరకు సోదాలు చేసి ఫామ్ హౌస్ నుంచి మళ్లీ పోలీస్​స్టేషన్​కు రాజ్​ పాకాలకు పోలీసులు తీసుకువెళ్లారు.  క్రాస్​చెక్​చేయడానికి మళ్లీ అవే ప్రశ్నలతో పాటు కొత్త ప్రశ్నలు అడిగారు. కొన్ని ప్రశ్నలకు తెలియదని.. మరికొన్ని ప్రశ్నలకు  గుర్తులేదని రాజ్​ చెప్పిన్నట్లు సమాచారం.

తాను ప్రతి విచారణకు హాజరవుతానని హామీ ఇవ్వడంతో రాత్రి 8 గంటల తర్వాత రాజ్ పాకాలకు బీఎన్ఎస్ఎస్​ 35(3) క్లాజ్ ప్రకారం నోటీసులు ఇచ్చి పంపించారు. ఎప్పుడు విచారణకు పిలిచినా రావాలని తేల్చిచెప్పారు. కాగా, సాయంత్రం 5 గంటల తర్వాత రాజ్ పాకాల సోదరుడు శైలేంద్ర మోకిల పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. అతడ్ని కూడా ఫామ్​హౌస్​లో జరిగిన పార్టీ గురించి ప్రశ్నించినట్టు తెలిసింది.

కాంటినెంటల్​ హాస్పిటల్​లో మద్దూరి

చేవెళ్ల : జన్వాడ ఫాంహౌస్​లో పార్టీ రోజు డ్రగ్స్​ తీసుకున్న విజయ్​ మద్దూరి బుధవారం కాంటినెంటల్​ హాస్పిటల్​లో ఉన్నట్టు తెలిసింది. ఫాంహౌస్​లో ఘటన జరిగిన తెల్లవారే విజయ్​ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అందులో రాజ్​ పాకాల కొకైన్​ ఇస్తేనే వాడానని చెప్పడంతో మోకిలా పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి నోటీసు ఇచ్చి పంపించారు.  ఎప్పుడు విచారణకు రమ్మని  పిలిచినా హాజరుకావాలని  కోరారు. అదుపులోకి తీసుకున్నప్పుడు విజయ్​ వేరే మహిళ ఫోన్​ ఇవ్వడం, కాంటాక్ట్​ నంబర్​ అడిగితే మరో మహిళది ఇవ్వడంతో  కాంటాక్ట్​ కాలేకపోయారు.

విచారణకు రావాలని ఫోన్​ చేస్తే వేరే   మహిళ ఫోన్​ లిఫ్ట్​ చేయగా అసలు విషయం గుర్తించారు.   ఆ ఫోన్​ కోసం మంగళవారం రాయదుర్గంలోని విజయ్​ మద్దూరి విల్లాలో సోదాలు చేశారు. కానీ ఫోన్​ దొరకలేదు. ఎవరి ఫోన్​ అయితే ఇచ్చాడో ఆ మహిళ స్టేట్​మెంట్​ కూడా రికార్డు చేసుకున్నారు. బుధవారం విజయ్​..రాజ్​తో పాటు  మోకిలా పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉండగా రాలేదు.  దీంతో అతడు ఎందుకు రాలేదని రాజ్​ను ప్రశ్నించగా కాంటినెంటల్​ హాస్పిటల్​లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నాడని రాజ్​ వెంట వచ్చిన అడ్వొకేట్లు చెప్పారు. దానికి సంబంధించిన మెడికల్​ రిపోర్ట్స్​ అందజేశారు. దీంతో త్వరలోనే విజయ్​ను విచారణకు పిలుస్తామని పోలీసులు చెప్పారు. 

ఎవరికో పాజిటివ్ వస్తే నాకేం సంబంధం

మా ఫామ్ హౌస్ లో జరిగింది కుటుంబ ఫంక్షన్. విజయ్ మద్దూరి నేను డ్రగ్స్​ఇచ్చానని ఎలాటి స్టేట్ మెంట్ ఇయ్యలేదు. ఎవరికో డ్రగ్స్​పాజిటివ్ వస్తే నాకేం సంబంధం? ఈ ఘటనలో మా కుటుంబం డిస్టర్బ్ అయింది. ఫ్యామిలీ పార్టీలు చేసువద్దా? కావాలనే ఇష్యూను  పెద్దదిగా చిత్రీకరిస్తున్నరు. పోలీసుల విచారణకు సహకరించా. అన్ని ప్రశ్నలకు సమాదానం ఇచ్చా.  

- రాజ్ పాకాల, నిందితుడు  

మరోసారి విచారణకు పిలుస్తాం  

కేసు దర్యాప్తులో ఉంది. అవసరమైతే రాజ్ పాకాలను మరోసారి విచారణకు పిలుస్తాం. విచారణకు సహకరిస్తున్నాడు. ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంటుంది. విజయ్ మద్దూరి హాజరుకావాల్సి ఉండే. రాలేదు.

       - నార్సింగి ఏసీపీ రమణ గౌడ్