రాజ్​తరుణ్ ఇంట్లోకి వెళ్లేందుకు ​పేరెంట్స్ ​యత్నం.. అడ్డుకున్న లావణ్య.. తనకు ఎప్పుడో రాసిచ్చాడని వాదన

రాజ్​తరుణ్ ఇంట్లోకి వెళ్లేందుకు ​పేరెంట్స్ ​యత్నం.. అడ్డుకున్న లావణ్య.. తనకు ఎప్పుడో రాసిచ్చాడని వాదన

గండిపేట, వెలుగు: సినీనటుడు రాజ్​తరుణ్, లావణ్య మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. గండిపేట మండలం కోకాపేటలో రాజ్‌‌‌‌తరుణ్ కు ఒక ఇల్లు ఉండగా, అందులో కొంతకాలంగా లావణ్య ఉంటోంది. బుధవారం ఉదయం రాజ్‌‌‌‌తరుణ్ తల్లిదండ్రులు రాజేశ్వరి, బసవరాజ్ కొంతమంది కేర్‌‌‌‌టేకర్లతో కలిసి కోకాపేటలోని ఇంటికి వచ్చారు. తన కొడుకు ఇంట్లో తాము ఉండటానికి వచ్చామని చెప్పారు.

ఇంట్లోనే ఉన్న లావణ్య వారిని అడ్డుకుంది. ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. రాజ్‌‌‌‌తరుణ్ తల్లిదండ్రులు మాట్లాడుతూ తాము ఇప్పటివరకు కిరాయి ఇంట్లో ఉంటున్నామని, సొంత ఇంటిలోకి వచ్చే ఉద్దేశంతోనే ఇక్కడకు వచ్చామని వెల్లడించారు. ‘లావణ్య ఒక గదిలో ఉంటే, మేము మరో గదిలో ఉంటాం. ఇది మా సొంతిల్లు’ అని వాదించారు.

లావణ్య మాత్రం రాజ్‌‌‌‌తరుణ్ ఇంటిని తన పేరు మీద రాసిచ్చాడని, అతని తల్లిదండ్రులు గొడవ సృష్టించేందుకు వచ్చారని ఆరోపించింది. దీనిపై కోర్టులో కేసు ఉందని, ఉండాలనుకుంటే పోలీస్ స్టేషన్‌‌‌‌కు వెళ్లి అనుమతి తీసుకోవాలని ఆమె కోరింది. ఒక దశలో రాజ్‌‌‌‌తరుణ్ తల్లిదండ్రులు ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించే యత్నం చేయగా లావణ్య వారిని గేటు వద్దే అడ్డుకుంది.

ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ రాజ్​తరుణ్​ తల్లిదండ్రులు, వెంట వచ్చిన వారు ఇంటి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారని, రౌడీలను తీసుకువచ్చి దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించింది. తాము పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్​చేస్తామని చెప్పి రాజ్​తరుణ్​తల్లిదండ్రులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.