నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్ర భవిష్యత్తు కోసం వచ్చిన ఎన్నిక అని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మునుగోడు మండలం కిష్టపురం గ్రామంలో క్యాంపెయినింగ్ నిర్వహించారు. ఉప ఎన్నికతో ఫాంహౌస్ లో పడుకున్న కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబాన్ని మునుగోడుకు తీసుకొచ్చానని అన్నారు. సీఎం కేసీఆర్ సిద్ధిపేట, సిరిసిల్ల జిల్లాల అభివృద్ధికి మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారని రాజగోపాల్ ఆరోపించారు. మునుగోడు తెలంగాణ రాష్ట్రంలో లేదా, తమ ప్రాంతం అభివృద్ధి చెందొద్దా అని ప్రశ్నించారు.
1000 మంది ఆత్మ బలిదానంతో ఏర్పాటైన తెలంగాణ ఇప్పుడు ఒక్క కుటుంబం కోసం ఏర్పడినట్లైందని కోమటి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాచరిక పాలన పోవాలంటే కేసీఆర్ కు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం తెలంగాణ ప్రజలంతా మునుగోడు వైపు చూస్తున్నారని, రాష్ట్రంలో కుటుంబ, అవినీతి పాలన పోయి ప్రజాస్వామ్యం రావాలంటే తనను గెలిపించాలని కోరారు.
కోమటిరెడ్డితో పాటు ప్రచారంలో పాల్గొన్న చొప్పదండు మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఉద్యమకారులను అసెంబ్లీలో చూసే ఇష్టం లేక సీఎం కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ కు ఓటేయకుంటే సంక్షేమ పథకాలు ఆపేస్తామని అంటున్నారని మండిపడ్డారు. ప్రజల కోసం పని చేసే నాయకుడైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలని శోభ కోరారు. కల్వకుంట్ల కుటుంబంతో కొట్లాడుతున్న ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.